కలహాల కమలం

రెండో రోజూ అద్వానీ డుమ్మా
అద్వానీ ఇంటి ఎదుట భాజపా కార్యకర్తల ధర్నా
రోడ్డునపడ్డ కాషాయ రాజకీయాలు
పానాజీ, జూన్‌ 8 (జనంసాక్షి) :
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సాక్షిగా పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు పానాజీ వేదికగా సాగుతున్న సమావేశాలకు సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ డుమ్మాకొట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు అద్వానీ గైర్హాజరు కావడం పార్టీ ఇదే తొలిసారి. గుజారత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తున్న అద్వానీ సమావేశాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 85 ఏళ్ల అద్వానీ అనారోగ్యం వల్ల హాజరు కావడం లేదని చెబుతున్నప్పటికీ, మోడీపై వ్యతిరేకత కారణంగానే ఆయన రాలేదని సమాచారం. చివరి రోజు సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. న్యూఢిల్లీ నుంచి గోవాకు రావాల్సిన ప్రత్యేక చార్టర్డ్‌ విమానం రద్దయ్యింది. అద్వానీ కోసం ఈ విమానాన్ని పార్టీ అద్దెకు తీసుకుంది. 2014 ఎన్నికల్లో మోడీకి కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై బీజేపీ నిలువునా చీలిపోయింది. ఆయన ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని ఓ వర్గం యత్నిస్తుండగా, అద్వానీ వర్గం వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించే అంశంలో పార్టీలో నిప్పు రాజేసింది. మోడీకి కీలక బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్న అద్వానీ రెండోరోజూ కూడా సమావేశానికి హాజరు కాలేదు. దీంతో పార్టీలోని విభేదాలు, ముదురుతున్న సంక్షోభం మరోమారు బహిర్గతమైంది. అయితే, అనారోగ్య కారణాలతోనే తొలి రోజు సమావేశాలకు రాలేదని అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ సమర్థించుకున్నప్పటికీ, శనివారం జరిగిన అత్యంత కీలకమైన కార్యవర్గ సమావేశానికి కూడా హాజరు కావొద్దని అద్వానీ నిర్ణయించకోవడం పార్టీలోని విభేదాలను తేటతెల్లం చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన గైర్హాజరు కావడం ఇదే తొలిసారి. వచ్చే ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మోడీని నియమించాలనే ప్రతిపాదనను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న అద్వానీ.. గోవా సమావేశాలకు గైర్హాజరవడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అద్వానీ మద్దుతదారులైన సీనియర్‌ నేతలు ఉమాభారతి, జశ్వంత్‌సింగ్‌, యోగి ఆదిత్యానాథ్‌ తదితరులు కూడా సమావేశాలకు డుమ్మా కొట్టారు. అయితే, ఈ విషయాన్ని చిన్నదిగా చేసి చూపడానికి బీజేపీ అగ్రనాయకత్వం ఆపసోపాలు పడుతోంది. అనారోగ్య కారణాల వల్లే అద్వానీ రాలేదని పాత మాటలే వల్లేవేసింది. కాంగ్రెస్‌ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వాస్తవానికి మోడీ ఫీవర్‌ పట్టుకుంది కాంగ్రెస్‌కు కాదని, బీజేపీకేనని ఎద్దేవా చేసింది. సీనియర్‌ నేతలు చాలా మంది గోవా సమావేశానికి గైర్హాజరయ్యారని ఈ చర్య ఆ పార్టీలో మోడీ పట్ల వ్యతిరేకతను సూచిస్తోందని విమర్శించింది.

సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ విమర్శించింది. తక్షణమే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది. బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తులో వేలు పెట్టినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెలకొందని ధ్వజమెత్తారు. దేశ భద్రత సందిగ్ధంలో పడిందని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. గోవాలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభోపాన్యాసం చేశారు. పార్టీ బలోపేతం, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, దేశ భద్రత, ఇతర పరిస్థితులు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయా వివరాలను పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జగదేకర్‌ విలేకరులకు వెల్లడించారు.బొగ్గు కుంభకోణం దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినా మన్మోహన్‌ ప్రధాని పదవిలో కొనసాగడం సరికాదని అన్నారు. ‘స్వయంగా ప్రధానిపైనే ఆరోపణలు వస్తున్న తరుణంలో.. సీబీఐ దర్యాప్తు నివేదికను న్యాయ మంత్రి గదిలో ఎలా మారుస్తారని’ ప్రశ్నించారన్నారు. నివేదికలో మార్పులను సుప్రీంకోర్టు తూర్పారబట్టిందని గుర్తు చేశారు. ‘నివేదికలో మార్పులను చూసి సుప్రీంకోర్టే తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు నివేదిక ఆత్మనే మార్చివేశారని ఆక్షేపించింది. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రధాని ఇంకా పదవిని పట్టుకొని వేలాడుతున్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి ఆయన తప్పుకోవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. తక్షణమే మన్మోహన్‌ వైదొలగాలని డిమాండ్‌ చేశారు.యూపీఏ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా యూపీఏ సంబరాలు నిర్వహించుకోవడంపై మండిపడ్డారు. ‘యూపీఏ తొమ్మిదేళ్ల పాలనలో దేశం రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయింది. దేశ భద్రత సందిగ్ధంలో పడింది. అయినా ఈ సమయంలో సంబరాలు అవసరమా? దేశాన్ని నాశనం చేసి విూకు సంబరాలు జరుపుకొనే హక్కుందా?’ అని ప్రశ్నించారు. కీలక బిల్లులు ఆమోదం పొందకుండా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగకపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు పవన్‌కుమార్‌ బన్సాల్‌, అశ్వనీకుమార్‌లను తొలగించాలని విపక్షాలు డిమాండ్‌ చేసినప్పుడే వారిని తొలగించి ఉంటే, ఆ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. ‘రైల్వే, న్యాయ శాఖ మంత్రులను రాజీనామా చేయించాలని మేం డిమాండ్‌ చేసినా వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత వారిద్దరినీ తప్పించారు. ఆ పని ముందే చేసి ఉంటే.. పార్లమెంట్‌ సజావుగా సాగేది. సభ నడవపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని’ అన్నారు.తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలోనూ పెట్టిందని, డిసెంబర్‌ 9న రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి వెనక్కుపోయిందని విమర్శించారు. తొలి నుంచి కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. గతంలో తాము మూడు రాష్టాల్రు ఏర్పాటు చేశామని, కానీ ఒక్క రాష్టాన్న్రి ఏర్పాటు చేసేందుకు కూడా కాంగ్రెస్‌ ముందుకు రావడం లేదన్నారు. బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని పునరుద్ఘాటించారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.