కలుషిత నీటితో గ్రామాల్లో వ్యాధులు

ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): పలుగ్రామాల్లోని బోరింగ్‌ నీళ్లు కలుషితంగా రావడంతో గ్రామస్థులు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. పళ్లు పసుపుపచ్చగా మారడం, సత్తువ తగ్గిపోవడం తదితర
అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అధికారులు మాత్రం నీటి పరీక్షలు నిర్వహించడం లేదు.
గ్రామ ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు.  గ్రామంలోని చేతిపంపు నుంచి ప్లోరైడ్‌ నీరు వస్తోంది. ఈ నీటిని తాగడం వల్ల గ్రామస్థులు ప్లోరోసిస్‌ బారిన పడుతున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులతో పాటు దంతాలు పసుపురంగులోకి మారిపోతున్నాయి. యుక్తవయస్సులో ఉన్నవారు సైతం బక్కచిక్కినట్లుగా దర్శనమిస్తున్నారు. రక్షిత మంచినీటి పథకాలు శుభ్రం చేయకపోవడం.. లీకేజీలు సరిచేయక ప్రజలు కలుషిత నీటిని తాగి ఆసుపత్రుల పాలవుతున్నారు పంచాయతీల్లో పరీక్షలు ఎక్కడా నిర్వహించకపోవడంతో కలుషిత నీరే తాగాల్సి వస్తోంది.ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం జాతీయ నీటి నాణ్యత, పరిశీలన రక్షణ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు సురక్షిత జలాలు అందించేందుకు గ్రామాల్లో ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు నిర్వహించి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కిట్లను పంపిణీ చేశారు.  చాలా గ్రామాల్లో నీటి పరీక్షలను నిర్వహించడం లేదు. పథకాలు పనిచేయకపోవడంతో అందుబాటులో ఉండే కలుషిత నీరే తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.  జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నీటి పరీక్షలపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించామని, వారే చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.పరీక్షలు చేయని వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

తాజావార్తలు