కలెక్టర్ కు వినతి పత్రం
కరీంనగర్ : ఎస్సీ ఉపకులాలకు కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎమ్‌ఆర్‌ఓల తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీలో ఎస్సీ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత లేదని, సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా దళిత వర్గంలో 59 కులాలు ఉన్నా కేవలం రెండు కులాలు మాత్రమే సంక్షేమ పథకాలను అనుభవిస్తూ, మిగత ఎస్సీ ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎమ్‌ఆర్‌ఓలు రామడుగు, జగిత్యాల, హుజురాబాద్, హుస్నాబాద్, గంగాధర, ఇతర మండలాల్లో తీవ్ర జాప్యం చేస్తూ వేలాది మంది విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని విమర్శించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీలో ఎస్సీ ఉపకులాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో సమితి అధ్యక్షుడు చింతల మల్లిఖార్జున్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ చింతల యాదగిరి తదితరులు ఉన్నారు.