కాంగ్రెస్‌పై వ్యతిరేకత

బీజేపీపై ప్రజల్లో అనాసక్తి శ్రీథర్డ్‌ ఫ్రంట్‌కే చాన్స్‌
అద్వానీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, అదే సమయంలో దేశవాసులు భారతీయ జనతా పార్టీపై అనాసక్తత కనబరుస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో థర్డ్‌ ఫ్రంట్‌కే ఎక్కువ అవకాశాలుంటాయని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యాడ్యురప్ప 2010లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఆ సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నితిన్‌ గడ్కరీ అతడిని సమర్థించే ప్రయత్నం చేయడంతో పార్టీపై ప్రజల్లో చులకన భావం ఏర్పడిందన్నారు. లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకంగా బాగా పెరిగిపోయిందన్నారు. ఈ సమయంలో లబ్ధిపొందాల్సిన బీజేపీ స్వయం కృతాపరాథంతో ప్రజలకు దూరమైందని స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా పౌరసమాజంలో పోరాట పంథా మొదలైందన్నారు. కుంభకోణాలను భరించేస్థాయిలో ప్రజలు లేరని, అలాంటి చర్యలకు ఎవరు పాల్పడిన వారిపై అంతేస్థాయిలో వ్యతిరేకత కనబర్చడం ఖాయమన్నారు. కర్ణాటకలో చోటు చేసుకున్న అవినీతిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అవలంబించిన విధానం సరికాదని, ఆయన సమర్థవంతంగా పనిచేసి ఉంటే ప్రజల్లో బీజేపీ దోషి అయ్యే పరిస్థితులు తలెత్తకపోయేవి అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో చేపట్టన ఆరు యాత్రల గురించి, వాటికి ప్రజల్లో వచ్చిన స్పందన గురించి పేర్కొన్నారు. దేశంలోనే అభివృద్ధిలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని, అవి దేశానికి ఆదర్శప్రాయమని అన్నారు. త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉంటే జాతీయ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని చూసి రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించే పార్టీలకు ఇకపై గడ్డురోజులేనని స్పష్టం చేశారు.