కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు

ప్రకటన చేయడమే ఆలస్యం
హైదరాబాద్‌ చేరిన సీఎం
న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం శనివారం కూడా కసరత్తు చేశారు. ఉదయం సోనియాతో మరోమారు సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స, గులాంనబీ ఆజాద్‌లు సమావేశమై చర్చించారు. ఎట్టకేలకు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారైనట్లు తెలిసింది. దీంతో సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ బొత్స, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌ గులాంనబీ అజాద్‌ ఉదయం సమావేశమై అభ్యరులను ఖరారు చేశారని సమాచారం. అయితే ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను మాత్రం ఇంకా బయటపెట్టలేదు. అభ్యర్థుల ఎంపికలో సోనియా స్వతంత్రంగా వ్యవహరించారని తెలుస్తోంది. సీఎం, పీసీసీ చీఫ్‌ సూచించిన పేర్లు కాకుండా కొత్త పేర్తు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న వారి పేర్లలో చాలా మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేషన్‌ దాఖలు చేయడానికి సోమవారం తుది గడువు అయినందున ఏక్షణంలోనైనా అభ్యర్థుల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఆదివారం బీఫామ్స్‌ ఇవ్వనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. నామినేషన్ల దాఖలుకు అమావాస్య అడ్డంకి కాదని ఆయన అన్నారు. పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ధీరావత్‌ భారతి, వాణి, రఘురామిరెడ్డి, కంతేటి సత్యనారాయణ రాజు, దయాసాగర్‌, షబ్బీర్‌ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే షబ్బీర్‌ ఆలీకు టిక్కెట్‌కోసం అజాద్‌ గట్టిగా పట్టుపట్టినట్లు తెలియవచ్చింది. కాగా ఎమ్మెల్సీ జాబితాను ఖరారు చేయించుకోవడానికి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం హైదరాబాదు చేరుకున్నారు. బొత్స సత్యనారాయణ మాత్రం అక్కడే మకాం వేస్తున్నారు. కాగా, కాంగ్రెసు ఐదుగురు అభ్యర్తులను మాత్రమే పోటీకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మాజీమంత్రి కోటగిరి విద్యాధర్‌ రావు కోసం కేంద్రమంత్రి చిరంజీవి పట్టుబడుతున్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కోటగిరిక కూడా ఇవ్వాలని కోరుతున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న చిరంజీవి ఈ విషయంలో గట్టిగా చెప్పివెళ్లినట్లు సమాచారం. ఇక మాజీ స్పీకర్‌ కెఆర్‌ సురేశ్‌ రెడ్డి కోసం సిఎం పట్టుబడుతున్నారు. అయితే ఎవరికి టిక్కెట్లు ఇస్తారన్నది చివరి వరకు సందిగ్ధంగానే కనిపిస్తోంది.