కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తదన్న నమ్మకం లేదు

ఉద్యమిస్తేనే ప్రత్యేకరాష్ట్రం : కేసీఆర్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తదన్న నమ్మకం లేదు, ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బుధవారం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో టీఎన్‌జీవోస్‌ హ్యాండ్‌ బుక్‌ ఆవిష్కరణలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, త్వరలోనే మధ్యంతర ఎన్ని కలు రావడం ఖాయమన్నారు. తెలంగాణ సమాజాన్ని నిండా ముంచింది జవహర్‌లాల్‌ నెహ్రూ అని ఆరోపించారు. తెలంగాణ నేతలు జైళ్లకు పోతున్నారు. కానీ, ఉద్యమంలోకి రావడం లేదన్నారు. సన్నాసులను సన్నాసులు అనకుంటే ఏమంటారని ప్రశ్నించారు. చవటలు, సన్నాసులు ఉద్యమంలోకి రారని

తీర్మానం చుసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారని ఉద్యోగులను సీమాంధ్ర సర్కారు వేధిస్తోందని, వారిపై ఈగ వాలితే ఖబడ్దార్‌ అని సీఎం కిరణ్‌ను హెచ్చరించారు. ఉద్యోగులతో బండ చాకిరీ చేయిస్తూ.. వారిపైనే ఏసీబీ దాడులు చేయించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రికి కూడా జీతం రాకుండా చేసిన ఘనత తెలంగాణ ఉద్యోగులదని కొనియాడారు. ఒక్క అటెండర్‌ మీద ఈగవాలిన ఉద్యోగులంతా పెన్‌డౌన్‌ చేస్తారని హెచ్చరించారు. మన ఐక్యతే మనకు రక్షణగా ఉంటుందని అన్నారు. ఇంతదూరం వచ్చాక తెలంగాణ ఉద్యమం ఆగుతుందనుకోవడం ప్రభుత్వం మూర్ఖత్వం అన్నారు. ఆరునూరైనా ఎన్నికల తర్వాత తెలంగాణ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.