కాంగ్రెస్‌ నేతలను పల్లెలకు రానివ్వొద్దు

మనల్ని పట్నానికి రానివ్వకపోతే వాళ్లెట్లా పల్లెకొస్తారు?
కాంగ్రెస్సే లక్ష్యంగా ఇక ఉద్యమం : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ నేతలను పల్లెల్లోకి రానివ్వద్దని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీ జేఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతోందని, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసుకునే తమ పోరాటాలు ఉంటాయని కోదండరామ్‌ పేర్కొన్నారు. తెలంగాణాకు కాంగ్రెస్సే ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. అధికారంలో ఉండి ప్రజలను పార్లమెంట్‌ సాక్షిగా మోసం చేసిందన్నారు. ఉద్యమాలు చేసుకునే హక్కును కూడా కాలరాసిన కాంగ్రెస్‌ను గ్రామాల్లో ప్రజాకోర్టులు ఏర్పాటుచేసి ఎండగడుతామన్నారు. పట్టణానికి తమను రానివ్వని కాంగ్రెస్‌ను పల్లెల్లోకి రానివ్వబోమని, ఈ దిశగానే తమ పోరాటాలు ఉంటాయన్నారు. చలో అసెంబ్లీ సందర్బంగా ప్రభుత్వం చేసిన పోలీస్‌ దమనకాండపై కోర్టుకు వెళ్లాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్‌ జడ్జీలతో ప్రజాకోర్టు నిర్వహిస్తామన్నారు. టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌లు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని కోదండరామ్‌ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గ్రామగ్రామాన ప్రచారం చేస్తామన్నారు.  పోలీసులు కొట్టిన దెబ్బలకు కొందరికి రక్తం గడ్డ కట్టిందని ఆవేదన నిండిన గొంతుతో వెల్లడిరచారు. రక్తం గడ్డకట్టేలా కొట్టారంటే పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో తెలిసిపోతుందన్నారు. ఇన్ని దుర్మార్గాలకు కారణమైన కాంగ్రెస్‌కు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వెల్లడిరచారు. త్వరలోనే జాతీయ స్థాయి సెమినార్లు నిర్వహిస్తామని టిఎన్జీఓ అధ్యక్షుడు దేవిప్రసాద్‌ పేర్కొన్నారు. చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసులు తెలంగాణవాదులపై అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు.