సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం
స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్ అకాడమీకి చెందిన నోబెల్ కమిటీ విజేతలకు ప్రదానం చేస్తుంది.గత సంవత్సరం ఈ బహుమతిని దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ దక్కించుకున్నారు. స్వీడిష్ అకాడమీ సభ్యులు నామినేటెడ్ అభ్యర్థుల రచనలను రహస్యంగా అంచనా వేస్తారు. అకాడమీ సభ్యుల మెజారిటీ మద్దతును అందుకున్నవారే తుది అర్హత సాధిస్తారు. గోప్యతా నియమం అన్ని బహుమతి విభాగాలకు వర్తిస్తుంది. లాబీయింగ్, మీడియా హైప్, రాజకీయ జోక్యం మొదలైనవాటికి ఎంపిక ప్రక్రియలో తావుండదు. కఠినమైన గోప్యత, నిపుణుల నిర్ణయం, మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకే నోబెల్ బహుమతులకు అత్యంత అర్హులైనవారిని ఎంపిక చేస్తారు.1954లో హంగేరీలోని గ్యులాలో జన్మించిన క్రాస్జ్నాహోర్కై 1985లో తన తొలి నవల సాటాంటాంగోతో రచనారంగంలో తనదైన ముద్ర వేశారు. ఇది కునారిల్లుతున్న గ్రామీణ సమాజాన్ని ప్రతిబింబించింది. ఈ నవల దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 2013లో ఆంగ్లంలో ఉత్తమ అనువాద పుస్తక అవార్డును గెలుచుకుంది. లాస్లో క్రాస్జ్నాహోర్కై 1987లో కమ్యూనిస్ట్ హంగేరీని విడిచిపెట్టి, ఫెలోషిప్ కోసం పశ్చిమ బెర్లిన్‌లో ఒక సంవత్సరం గడిపారు. ది ప్రిజనర్ ఆఫ్ ఉర్గా, డిస్ట్రక్షన్ అండ్ సారో బినీత్ ది హెవెన్స్ వంటి రచనలలో తూర్పు ఆసియా, చైనాల నుండి ప్రేరణ పొందారు. లాస్లో క్రాస్జ్నాహోర్కై రచనలకు లెక్కకు మించిన అభిమానులున్నారు.