బంజారాహిల్స్ వద్ద హైడ్రా భారీ ఆపరేషన్
` 5 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు
` భూమి విలువ రూ.750 కోట్లు
` పలుచోట్ల 7.50 ఎకరాల కబ్జాలకు విముక్తి
హైదరాబాద్(జనంసాక్షి): హైడ్రా మరో భారీ ఆక్రమణను తొలగించింది. బంజారాహిల్స్‌లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల విలువైన భూమిగా అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఆక్రమణలను గుర్తించిన హైడ్రా శుక్రవారం బారీ బందోబస్తు మధ్య తొలగించింది. గతంలో ప్రభుత్వం 5 ఎకరాల్లో 1.20 ఎకరాలను జలమండలికి కేటాయించింది. ఈక్రమంలో 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమిని తన అధీనంలోకి తీసుకొని అందులో షెడ్లు నిర్మించాడు. ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ వాటర్ రిజర్వాయర్ నిర్మించాలనే జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడు. ఫేక్ సర్వే నంబర్ (403/52)తో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉంటే.. 403/52తో ఆక్రమణలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధరించారు. అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈక్రమంలో షేక్‌పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య శుక్రవారం హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణదారు వేసిన ఫెన్సింగ్‌తో పాటు లోపల ఉన్న షెడ్లను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సవిూపంలో ఆక్రమణకుగురైన ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. కాగా, వీఆర్ ఇన్‌ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్ భార్గవా భూమిని కబ్జా చేసినట్టు తెలిసింది