కాంగ్రెస్‌, భాజపాలకు భంగపాటు తప్పదు

– సామూహిక వివాహ వేడుకల్లో జయలలిత
చెన్నై, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి జయలలిత ధ్వజమెత్తారు. కావేరీ జలాల విడుదలకు సంబంధించి ఆ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని కర్ణాటక ప్రయోజనాలనే పరిరక్షిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు రానున్న లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడు, పాండిఛ్చేరి లోని 40స్థానాలను అన్నా డిఎంకె గెలుచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. తమిళనాడున్యాయపరమైన డిమాండ్లు పరిష్కారానికి ఊతమిచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఈ 40స్థానాలలో పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలలో ఆమె 65వ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారంనాడు 65సామూహిక వివాహాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వధువులకు తాళిబొట్లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రేపటి తమ లక్ష్యాలు సాధించాలంటే వచ్చే ఎన్నికలలో 40 సీట్లను సొంతం చేసుకోవాలని ఆమె చెప్పారు. కార్యకర్తలంతా అందుకు గట్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సంఖ్యాపరంగా 40స్థానాలు గెలుచుకుంటే దేశంలో తమిళనాడు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కావేరీ డెల్టా ప్రాంతం ఏడారి కాకుండా ఉండాలన్నా, తమిళనాడు రాష్ట్ర హక్కులు కాపాడుకోవాలన్నా భవిష్యత్‌ ప్రణాళికలు సాకారం కావాలన్నా, రాష్ట్ర ప్రజల వాణి ఢిల్లీలో వినిపించి న్యాయపరమైన డిమాండ్లు నేరవేర్చగల ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందువల్ల 40 లోక్‌సభా స్థానాలను గెలుపొందేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు రెండూ కర్ణాటకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమిళనాడు ప్రయోజనాలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు అధికారంలోకి రాలేవని ఆమె జోస్యం చెప్పారు. తాను మూడోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో సంక్షోభాలు, సవాళ్ళు ఎదుర్కుంటున్నప్పటికీ కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తోందని ఆమె విమర్శించారు.