కాంగ్రెస్‌ మోసం చేసింది అందుకే పార్టీ వీడుతున్న

తెలంగాణ కోసమే ఈ నిర్ణయం : కేకే
హైదరాబాద్‌, మే 31 (జనంసాక్షి) :
‘కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసింది.. అందుకే పార్టీ వీడుతున్న’ని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ పార్టీని విడిచినందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. అయితే ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ పార్టీ నిలుపుకోనందువల్లే తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌ పార్టీకి లేదని స్పష్టమైందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము పెట్టిన డెడ్‌లైన్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఇవ్వని కాంగ్రెస్‌లో ఉండడం సరికాదన్న భావనతోనే పార్టీని వీడుతున్నానని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు అవుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్‌ 9, 2009న తెలంగాణ ఇస్తామని కేంద్రమంత్రి చిదంబరం ప్రకటించారని, అయితే సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్‌ వ్యతిరేకమన్న భావన ప్రజల్లో నాటుకుపోయిందని అన్నారు. తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి అదిగో ఇదిగో అంటూ దాదాపు 1000 మంది కాంగ్రెస్‌ పార్టీ పొట్టనపెట్టుకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌ పార్టీలో లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంలోని కొందరు పెద్దలు సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ ప్రజల మనోభావాలను చులకన చేసేవిధంగా మాట్లాడరని అన్నారు. తనకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ముఖ్యమైన పదవులను అందించిందని, అయితే ఆ పార్టీకి ఎప్పటికి రుణపడి ఉంటానని కేశవరావు అన్నారు. కేవలం తెలంగాణ ఇవ్వనందుకే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ తెలంగాణ తేలేకపోతున్నానని, అందుకే తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. ఒక సెంటిమెంట్‌కు లోబడే తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు అన్నారు. ఇంకా కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే ప్రజలకు మెఓసం చేసినట్టు అవుతుందని భావించే తాను రాజీనామా ఇస్తున్నట్లు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వారికి కేశవరావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాధనే తన ప్రత్యేక లక్ష్యమని తెలిపారు. ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలకు బలమని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీల ద్వారానే ప్రజల మనోభావాలు తెలుస్తాయని కేశవరావు అన్నారు.