కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

– మాజీమంత్రి ఆర్డీఆర్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్ పై అకారణంగా,ఎలాంటి విచారణలు లేకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం సరైనది కాదన్నారు.ఏ ఒక్కరికి అనుకూలంగా వ్యవహరించకుండా,నిజానిజాలు తెలుసుకొని, నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు.త్వరలో ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను పార్టీని, అణచివేసేందుకు అధికార పార్టీ నేతలు తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు.ఇటీవల మంజూరైన ఆసరా పెన్షన్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయగా, ఆయా వార్డుల్లో కౌన్సిలర్లచే పంపిణీ చేయాలని సూచనలు చేసినప్పటికీ, టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డులో పంపిణీ చేసి ఘర్షణ వాతావరణ సృష్టిస్తున్నారని అన్నారు.అనంతరం డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి అక్రమ కేసులకు కాంగ్రెస్ నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు.అక్రమ కేసులను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చేకిలం రాజేశ్వరరావు , రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డిబ్, కౌన్సిలర్లు కక్కిరేణి శ్రీనివాస్ గుప్తా, మడిపల్లి విక్రమ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ కౌన్సిలర్ కొండపల్లి సాగర్ రెడ్డి , నెల్లుట్ల లింగస్వామి , కుమ్మరి కుంట్ల వేణు , మద్ది శ్రీనివాస్ యాదవ్, ఆలేటి మాణిక్యం,నరేందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.