. కాకలు దీరిన ‘కాకా’ ఇకలేరు

1

కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటస్వామి కన్నుమూత

తెలంగాణ కోసం కాకా తాపత్రయపడ్డారు

ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ డిసెంబర్‌22 (జనంసాక్షి) :: అంతా కాకా అని ముద్దుగా పిలుచుకునే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జి. వెంకటస్వామి కన్నుమూశారు. దళిత సామాజికవర్గం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన అతి కొద్ది మంది నేతల్లో వెంకటస్వామి ఒకరు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడినగా పలు పదవులు చేపట్టారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కాకా కీలక భూమిక పోషించారు. ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న ఆ సమయంలో ఎంపీగా ఉన్న గడ్డం వెంకటస్వామి ముషీరాబాద్‌ జైల్లో మగ్గుతున్న తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లారు. అప్పుడాయన పెద్దపల్లి ఎంపీగా పదవిలో ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన కాల్పుల్లో కాకా కాలికి బుల్లెట్‌ గాయమైంది. అలా ఉద్యమ గరిమెను పెంచిన ఘటనల్లో వెంకటస్వామి ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. 1957లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పలు ఉన్నత పదవులు అలంకరించారు. ఆయన ఇద్దరు కుమారులు వినోద్‌ మంత్రిగా, డాక్టర్‌ వివెక్‌ ఎంపీగా పదవులు నిర్వహించారు. 86 ఏళ్ల వయసున్న వెంకటస్వామి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహించిన వెంకట స్వామి అక్టోబర్‌ 5వ తేదీ 1929 సంవత్సరంలో జన్మించారు. ఇలాంటి ఎన్నో పదవులు అలంకరించిన అరుదైన నేతల్లో కాకా ముందు వరుసలో ఉన్నారు. 1957- 62 , 1978-84లో రెండు దఫాలు ఆంధ్రపదేశ్‌ లెజిస్లేటివ్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1967 లో పెద్దపల్లి నుంచి 4వ లోకసభకు ఎన్నికయ్యారు. 1969 నుంచి 71 వరకు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటి సభ్యునిగా పనిచేశారు.1971 లో 2వసారి లోకసభకు ఎన్నికయ్యారు. 1973 ఫిబ్రవరి నుండి నవంబర్‌ వరకు కేంద్ర లేబర్‌ అండ్‌ రిహాబిలిటేేషన్‌ డ్యూటి మినిస్టర్‌గా పనిచేశారు. అదే ఏడాది నవంబర్‌ నుండి 1977 మార్చ్‌ వరకు యునియన్‌ సప్లై అండ్రిహాబిలేషన్‌ డ్యూటి మినిస్టర్‌గా పనిచేశారు. 1977 లో మల్లీ 6వ లోకసభకు ఎన్నికయ్యారు. 1978 నుండి 1982 వరకు లేబర్‌ అండ్‌ సివిల్‌ సప్లై విభాగానికి ఆంధ్రప్రదేశ్‌ కబినేట్‌ మినిస్టర్‌గా పనిచేశారు.

1982 – 1984లో ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అద్యక్షుడి గా పనిచేసిన కాక 1989 లో నాల్గవ సారి లోకసభకు ఎన్నికయ్యారు.

1990 – 1991 ఎస్సీ ఎస్టీ వెల్ఫేరే కమిటి మెంబర్‌గా, పరిశ్రమల మంత్రిత్వశాఖ కాన్సులేటివ్‌ మెంబర్‌గా పనిచేశారు.

1991 లో మల్లీ 5వసారి 10వ లోకసభకు ఎన్నికయ్యారు.21జూన్‌ 1991 నుండి 17 జనవరి.1993 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఇండిపెండెంట్‌ హోదాలో పనిచేశారు. 18జనవరి.1993 – 10 ఫిబ్రవరి.1995 మధ్యకాలంలో టెక్స్‌ టైల్‌ మినిస్టర్‌గా ఎంఓఎస్‌ హోదాలో పనిచేశారు.10 ఫిబ్రవరి.1995 – 15 సెప్టెంబర్‌.1995 మధ్యకాలంలో టెక్స్‌ టైల్‌ మంత్రిత్వశాఖ మంత్రిగా కాబినేట్‌ హోదాలో సేవలందించారు.15 సెప్టెంబర్‌.1995-10 మే 1996 మధ్య కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. అంతేకాక, 20 ఫిబ్రవరి. 1996-16 మే 1996 యునియన్‌ కాబినేట్‌ మినిస్టర్‌, లేబర్‌ అండ్‌ టెక్స్‌ టైల్‌, 1996 లో మల్లీ 11వ లోకసభకు ఎన్నికయ్యారు. 2002-2004 లో ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ విభాగానికి అద్యక్షుడిగా పని చేశారు. 2004 లో మల్లీ 7వ సారి 14వ లోకసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ పార్టీ డిప్యుటి లీడర్‌గా, విద్యుత్‌ స్టాండింగ్‌ కమిటి మెంబర్‌గా వెంకటస్వామి పదవులు అలంకరించారు.    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాకా మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ కోసం కాకా పడిన తాపత్రయం మామూలు స్థాయిది కాదన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. కేసీఆర్‌తోపాటు టీపీసీసీ చీఫ్‌ పొన్నాల, వైఎసార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, ఏపీసీసీ మాజీ చీఫ్‌లు డి.శ్రీనివాస్‌, ఎం. సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌లు సంతాపం తెలిపారు.