కాకాకు కన్నీటి వీడ్కోలు
ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు
పాల్గొన్న రాహుల్, సీఎం కేసీఆర్
పలువురు ప్రముఖుల ఘన నివాళి
హైదరాబాద్,డిసెంబర్23: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి భౌతికకాయాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి నివాళుర్పించారు. కాకా మరణ వార్త విన్న ఆయన అభిమానులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నివాస గృహానికి చేరుకుని నివాళులు అర్పిం చారు.ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం రాజయ్య, వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి చిరంజీవి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కేశవరావు, బాల్క సుమన్, మాజీ మంత్రి దానం నాగేందర్, టీటీడీపీ నేత రమణ తదితరులు కాకా భౌతికకాయన్ని సందర్శించి నివాళుర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరా మర్శించారు. వెంకటస్వామి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలిస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళుర్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం వెంకటస్వామి భౌతికకాయాన్ని ఊరేగింపుగా పంజాగుట్ట శ్మశాన వాటికకు తీసుకువెళి
వెంకటస్వామి భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
్ల మధ్యాహ్నం 2గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాకా సోమవారం రాత్రి కన్ను మూశారు. కాకా మృతికి ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సంతాపం తెలిసింది. కాకా మృతి పట్ల సభ్యులందరూ మౌనం పాటించారు. ఉదయం కాకా భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రబాబు వెంట ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. కాకా మృతికి పలువురు కాంగ్రెస్ పెద్దలు సంతాపం ప్రకటించారు. వీరప్పమొయిలీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు సంతాపం తెలిపారు. కాంగ్రెస్‌కు వెంకటస్వామి ఎనలేని కృషి చేశారని మొయిలీ తెలిపారు. కార్మికులకు, దళితులకు వెంకటస్వామి అండగా నిలిచారని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కాకా మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వివేక్‌ను ఖర్గే ఫోన్‌లో పరామర్శించారు.
నివాళులు అర్పించిన నేతలు
సీనియర్ కాంగ్రెస్ నేత వెంకటస్వామి మృతిపై పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి మృతిచెందిన వెంకటస్వామి మృతదేహానికి నివాళులు అర్పించేందుకు నేతలు పెద్ద సంఖ్యలో బంజారాహిల్స్‌లోని కేర్ దవాఖానకు, ఆ తర్వాత ఆయన కుమారుడు వివేక్ నివాసానికి చేరుకున్నారు. కాకా భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతోపాటు వివిధ దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.వెంకటస్వామి మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో మాజీ మంత్రులు గీతారెడ్డి, డీ శ్రీధర్‌బాబు, జీ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కడియం శ్రీహరి, ప్రజాగాయకుడు గద్దర్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, భానుప్రకాశ్, ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి ప్రసాద్‌రావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేత జనక్ ప్రసాద్, ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, యలమంచిలి శివాజీ తదితరులు ఉన్నారు.వెంకటస్వామి ఆరోగ్య పరిస్థితి విషమించిన వార్తను తెలుసుకున్న వెంటనే సోమవారం ఉదయం నుంచే కేర్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు పోటెత్తారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు సురేశ్ షెట్కార్, రాజయ్య, టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, టీపీసీసీ అధికార ప్రతినిధులు మహేష్‌కుమార్‌గౌడ్, అద్దంకి దయాకర్, టీఆర్‌ఎస్ నేతలు మందా జగన్నాథం, దివాకర్‌రావు(ఎమ్మెల్యే), సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు కేర్ దవాఖానలో కాకా ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
కాకా ప్రస్థానం
పేరు:గడ్డం వెంకటస్వామి (కాకా)
విద్యాభ్యాసం: లాల్ దర్వాజ ఆర్యసమాజ్ స్కూలు, హైదరాబాద్ చాదర్‌ఘాట్ స్కూలు, మొగల్‌పుర స్కూలులో విద్యాభ్యాసం.
వివాహం: 1944లో కళావతితో వివాహం.
తొలి పదవి:1946,47లో 15 సం.ల చిరు ప్రాయంలోని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు. 1982లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియామకం.
ఎన్నిక: 1957లో ఆంధ్రప్రదేశ్‌లోని చెన్నూరు, సిర్‌పూరు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఏకధాటిగా 7 పర్యాయాలు ఎన్నికయ్యారు.
మంత్రి పదవులు:ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా 1972 నుంచి 77 వరకు కొనసాగారు. 1978 నుంచి 82 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేబర్ అండ్ సివిల్ సప్లయిస్ మంత్రిగా వ్యవహరించారు.1991-96లో పివి నరసింహారావు ప్రధాని హయాంలో కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖకు స్టేట్ మినిస్టర్‌గా పనిచేశారు. 1993లో కేంద్ర టెక్స్‌టైల్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
పథకాలు:1991లో చారిత్రాత్మక పంచాయతీ రాజ్ బిల్లు ప్రవేశపెట్టారు. 1993-94లో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయి బీఐఎఫ్‌ఆర్ కోరల్లో చిక్కుకోగా సంస్థకు 400 కోట్ల రూపాయల వడ్డీని మాఫీ చేయించి ఎన్టీపీసీ నుంచి 100 కోట్ల సొమ్ము అడ్వాన్స్‌గా ఇప్పించి సంస్థ గాడిలో పడటానికి కృషి చేశారు.1995లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండగా పదవీ విరమణ అనంతరం కార్మికులకు పెన్షన్ ప్రవేశపెట్టే విధానాన్ని తీసుకవచ్చి 85 లక్షల మంది కార్మికులకు పెన్షన్ ఇప్పించారు. 1973లో హైదరాబాద్‌లో బీఆర్ అంబేద్కర్ కళాశాలను ప్రారంభించారు.
నేతలకు ఆదర్శప్రాయుడు
కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి నుంచి ఉన్నత పదవులను అలంకరించిన నేత. ఆయనతో కలిసి దశాబ్దాలుగా కలిసి పార్టీకోసం పనిచేశాను. నేతలకు ఆదర్శప్రాయుడు. రాష్ట్రపతి కావాలని కోరుకున్నా నెరవేరలేదు. కానీ తెలంగాణ కల సాకారమైంది.
– టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు
సీనియర్ పార్లమెంటేరియన్‌గా ఆయన తెలంగాణ ప్రజలకు చిరపరిచితుడు.
– టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి
వెంకటస్వామి మృతి కాంగ్రెస్ పార్టీకి, బడుగు బలహీన వర్గాలకు తీరనిలోటు. 2004కు ముందు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన కోరుకున్నారు. కలిసి పనిచేశాం.
– టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్
వెంకటస్వామి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి
– టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్
వెంకటస్వామి సేవలు మరువలేనివి:గవర్నర్
కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి మృతిపై గవర్నర్ నరసింహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి తెలంగాణకు, దేశానికి తీరనిలోటని గవర్నర్ అన్నారు. పేదలకు, అట్టడుగు వర్గాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
స్వాతంత్రోద్యమంలోనూ పాల్గొన్న వెంకటస్వామి నిఖార్సైన కాంగ్రెస్ వాది. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. 1989 నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది.
– దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
కార్మిక సంఘ నేత స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవుల స్థాయికి ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.
– వీహెచ్, రాజ్యసభ సభ్యుడు
దక్కన్ హైదరాబాద్‌కు వెంకటస్వామి మారుపేరు. తెలంగాణ రాష్ట్రం గొప్పనేతను కోల్పోయింది.
– రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ
కాకా మృతితో తెలంగాణ సమాజం, కాంగ్రెస్ పార్టీ అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయింది.
-కే జానారెడ్డి, సీఎల్పీ నేత
కాకా మరణంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భీష్మాచార్యుడ్ని కోల్పోయింది. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన అరుదైన నేత.
– డీ శ్రీనివాస్, మండలిలో కాంగ్రెస్ నేత
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన నేత. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేతను కోల్పోయింది.
– పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ అధ్యక్షుడు
భీష్మాచార్యుడి వంటి వెంకటస్వామి మృతి కాంగ్రెస్ పార్టీకి, దళిత సమాజానికి తీరని లోటు.
– జే గీతారెడ్డి, మాజీ మంత్రి
కాకా మృతి తీరనిలోటు.
– ఎన్ రఘువీరారెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు
మంచి స్నేహితుడ్ని కోల్పోయా. రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన నేత.
– ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్
వెంకటస్వామి మృతి రాష్ట్రప్రజలకు తీరని లోటు.
– టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్
కాకా మృతి ఎస్సీ, ఎస్టీలకు లోటు. పార్టీలో ఉన్నతస్థాయికి ఎదిగిన నేత.
– టీపీసీసీ అధికార ప్రతినిధులు కొనగాల మహేష్, జే నర్సింగ్‌రావు
కాకా మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటు
– పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి వెంకటస్వామి మృతి తెలంగాణకు తీరని లోటు.
-కేంద్రమంత్రులు దత్తాత్రేయ, వెంకయ్య, బీజేపీ నేతలు మురళీధర్ రావు, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి
వెంకటస్వామి మృతితో దేశం గొప్ప రాజకీయ యోధుడ్ని కోల్పోయింది.
– చంద్రబాబు, ఏపీ సీఎం
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నేత.
– కేంద్రమంత్రి సుజనాచౌదరి
వెంకటస్వామి మృతి పట్ల ప్రగాఢ సంతాపం.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ టీటీడీపీ
బడుగు, బలహీన వర్గాల నేత. ఆయన మృతిపట్ల ప్రగాడ సంతాపం.
– ఆర్ లక్ష్మణ్ యాదవ్, అఖిలభారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి