కామరెడ్డిలో కల్తీ కల్లు కలకలం..

` 69కి చేరిన బాధితులు.. 13 మంది పరిస్థితి విషమం
కామారెడ్డి(జనంసాక్షి):తెలంగాణ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.. బీర్కూర్‌, నసుర్లబాద్‌ మండలాల్లో 69 మంది అస్వస్తత గురి కాగా.. అందులోని 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. ఒకేసారి 69 మంది ఆసుపత్రిలో చేరడంతో కల్తీ కల్లు ఉదంతం చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, అంకోల్‌ క్యాంపు, దుర్కితో పాటు బీర్కూర్‌ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపింది. ఈ గ్రామాల నుంచే బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని ఎక్సైజ్‌ సీఐ చెప్పారు..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్‌ మండలం అంకోల్‌, దుర్కి, అంకోల్‌ తండా, అలాగే బీర్కూర్‌?మండలంలోని దామరంచ తదితర గ్రామాల్లో సోమవారం పలువురు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. బాధితులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కల్తీ కల్లు వల్ల మెడ వంకర్లు, నాలుక మొద్దు బారిందని బాధితులు, వారి కుటుంబీకులు తెలిపారు.అయితే.. కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తాజావార్తలు