కాలుష్య నివారణ చర్యలకు పెద్దపీట వేయాలి
ఢల్లీి తరహా వాయు కాలుష్యం రాకుండా చూడాలి
చెట్ల నరికివేతను సీరియస్‌గా తీసుకోవాలి
న్యూఢల్లీి,డిసెంబర్18(జనంసాక్షి): మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే అధికార పీఠాలపై ఉన్న నేతలు, ఉన్నతాధికార వర్గంలో పనిచేస్తున్నవారు ఏ బళ్లో చదువుకుని ఆ స్థాయికి ఎదిగారోగానీ… దేశంలో ’అభివృద్ధి’ పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు. పర్యవసానంగా అడవులున్నప్రాంతాలు మెల్లగా ఎడారిగా మారుతున్నాయి. మహానగరాలు కూడా కాలుష్యకారకంగా మారుతున్నాయి. ఇటీవల ఢల్లీిలో కాలుష్య కారణంగా సుప్రీం కూడా దీనిపై సీరియస్‌గానే స్పందించింది. ఈ క్రమంలో కాలుష్యాన్ని చెక్ పెట్టే చర్యలను ప్రోత్సహించాలి. చెట్లను
కాపాడటానికి పర్యావరణ ఉద్యమ కారులు చేయని పోరాటమంటూ లేదు. లక్షలాది వృక్షాల్లో అనేకం ఏళ్లపైబడినవి. ఆ చెట్లనుంచి వీచే గాలిని ఆస్వాదిస్తూ మనమంతా ఎంజాయ్ చేస్తుంటాం. ప్రాణప్రదమైన ప్రాంతాన్ని పాక్షికంగానైనా నాశనం చేయడం తగదన్న స్పృహ లేకుండా ఉంటున్నాం. మన మహానగరాలు వేల కోట్లు ఆర్జించే పెట్టే బంగారు గనులే కావొచ్చు. అక్కడ అనేకులకు ఉపాధి దొరుకుతుండవచ్చు. కానీ వాటికి కావలసినంత అపకీర్తి కూడా ఉంది. అందులో అనేకం కాలుష్యకారకాలు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే! తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రపంచంలోని 15 నగరాల్లో మన వాటా 11! ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది. కేన్సర్, గుండె జబ్బులు వగైరాలకు కారణ మవుతోంది. అనేకుల్లో అకాల వృద్దాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. ఇల్లు కట్టుకుందామనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించ వన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. చట్ట ప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. ఏ చెట్టు తొలగించాలన్నా అందుకు అనుమతి ఉండాలి. అలా తొలగించడానికి పక్షం రోజుల ముందు ప్రజలందరికీ తెలిసేలా ఆ అనుమతిని పత్రికల్లో ప్రచురించాలి. ఆరేళ్లక్రితం బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం సంబంధిత సంస్థలు తమ తమ వెబ్‌సైట్లలో అనుమతి కాపీలను అప్‌లోడ్ చేయాలి. కానీ చెట్ల కూల్చివేతలో ఈ నిబంధనలేవీ పాటించడంలేదు. ఇలా చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం, ప్రశ్నించినవారిని నిర్బంధించడం దిగ్భార్రతి కలిగిస్తుంది. అడవుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్లను కాపాడుకుంటేనే పర్యావరణం మనగలుగుతుంది. పర్యావరణ పరిరక్షణ నిత్యకృత్యం కావాలని ప్రముఖ పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.