కాశ్మీర్‌లో కాస్త ఊరట
శ్రీనగర్,జులై 23(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న జమ్ము కశ్మీర్‌లో ఎట్టకేలకు కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి సానుకూలంగా ఉండడంతో కర్ఫ్యూ ఎత్తేశారు. కశ్మీర్ లోయలోని నాలుగు జిల్లాల్లో, శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి కాస్త కుదుటపడడంతో అధికారులు కర్ఫ్యూ తీసివేశారు. ముందుజాగ్రత్త చర్యగా లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. బందీపొరా, బారాముల్లా, బుద్గాం, గందేర్‌బల్ జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తేసినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఎక్కువ మంది ఒక్కచోట గుమిగూడొద్దంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. అనంతనాగ్, కుల్గాం, కుప్వారా, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రస్తుతం పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రాష్ట్రంలో పరిస్థితులను పర్యవేక్షించడానికి కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్‌నాథ్ అధికారులు, రాజకీయ నేతలతో సమావేశం కానున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానిని భద్రతాసిబ్బంది హతమార్చడంతో జులై 9 నుంచి రాష్ట్రంలో తీవ్ర ఘర్షణలు చెలరేగి 40 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.