కిరణ్‌కుమార్‌రెడ్డికి దళితబంధు బిరుదు ప్రదానం

దళిత శంఖారావంలో సీఎం వరాల జల్లు
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.400 కోట్లు : ముఖ్యమంత్రి
రాజమండ్రి, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) :
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి దళితరత్న బిరుదు ప్రదానం చేశారు. ఆదివారం రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన దళిత శంఖారావంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రులు జె. గీతారెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీమోహన్‌, ఎంపీలు హర్షకుమార్‌, కావూరి సాంబశివరావు చేతుల మీదుగా ముఖ్యమంత్రిని సత్కరించి బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌ మాట్లాడుతూ, చారిత్రాత్మక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నీటి ఎద్దడి నివారణకు రూ.400 కోట్లు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన నిధులు వారికే ఖర్చు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 1.23 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 82 వేల కొత్త ఉద్యోగాలను సృష్టించామని అన్నారు. రాజీవ్‌ యువకిరణాలు పథకం ద్వారా ప్రైవేటు సెక్టార్‌లో సుమారు 3 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. తాము ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పాటు పడుతుంటే ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని తెలిపారు. సబ్‌ప్లాన్‌నూ అడ్డుకునేందుకు కుట్ర పన్నాయని తెలిపారు. దీనిని ప్రజలందరూ గమనించారని తెలిపారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండా అని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి ప్రజల కోసం పనిచేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీలతో ఆర్ట్స్‌ కళాశాల మైదానం కిక్కిరిసింది.