కిరణ్‌ వైఫల్యం వల్లే మెడికల్‌ సీట్లలో

తెలంగాణకు అన్యాయం
అధిష్ఠానానికి తెలంగాణ ఎంపీల ఫిర్యాదు
గోదావరిఖని, జూలై 16, (జనం సాక్షి) :ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యం వల్లే తెలంగాణకు మెడికల్‌ సీట్లలో అన్యాయం జరిగిందని తెలంగాణ ఎంపీలు ఆరోపించారు. కిరణ్‌ సర్కార్‌ చూపించిన వివక్షకు హై కోర్టు గట్టి సమాధానం ఇచ్చిందని, అందుకే కేయూ, ఓయూల్లో సీట్లు పెంచాలని ఆదేశించిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జిల్లాల్లోని మెడికల్‌ కళాశాలల్లో అదనంగా సీట్లను పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ ఎంపీలు కోరారు. సోమవారం న్యూ ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆజాద్‌ను నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, పెద్దపల్లి ఎంపీ జి.వివేక్‌, వరంగల్‌ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టు మెడికల్‌ సీట్లను పెంచాలని ఆదేశించిందని, ఈ ఆదేశాలు అమలు జరిపేలా చర్యలు తీసుకోవాలని వారు ఆజాద్‌ను కోరారు. ఈ నేపథ్యంలో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. కాగా, తామిచ్చిన వినతిపత్రానికి ఆజాద్‌ వెంటనే స్పందించారని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ తెలిపారు. అసిస్టెంట్‌ స్టాటికల్‌ జనరల్‌ను విచారించిన మీదట ఆదేశాలు యుద్ధప్రాతిపదికన జారీ చేస్తామని ఆజాద్‌ హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు. మంత్రి చొరవతో కేవలం ఓయూ, కేయూల్లోనే కాకుండా తెలంగాణలోని అన్ని కాలేజీల్లో సీట్ల పెంపు జరుగుతుందని ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రతులను ఆజాద్‌కు అందజేసినట్లు తెలిపారు.