కిరణ్‌ సర్కారుకు కోదండరామ్‌ బంపర్‌ ఆఫర్‌

అసెంబ్లీలో తీర్మానం పెట్టండి
సడక్‌బంద్‌ విరమించుకుంటాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి) :శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేస్తే ఈనెల 21న నిర్వహించ తలపెట్టిన సడక్‌ బంద్‌ను విరమించుకుంటామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం ఆయన హైదరా బాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను పార్లమెంట్‌ గుర్తించాలనే లక్ష్యంతోనే సడక్‌బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వానికి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. ప్రజావ్యతిరేక విధానాలు పాటిస్తున్న ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కూడా మద్దతు ఇచ్చినట్లైతే బాగుండేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ తటస్థ వైఖరితో అధికార పార్టీతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అసెంబ్లీ వేదికగా బయటపడిందన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో తెలంగాణపై మాట్లాడిన తీరు ఆయన దురంహకానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఇప్పటికైనా సీఎం వైఖరి మార్చుకుంటే బాగుంటుందని అన్నారు. 21న శంషాబాద్‌ నుంచి ఆలంపూర్‌ వరకు నిర్వహించనున్న సడక్‌ బంద్‌ విజయవంతం చేసేందుకు ఇన్‌చార్జీలను నియమించినట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. శంషాబాద్‌కు ఎమ్మెల్యేలు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్‌, మహమూద్‌ అలీ, జడ్చర్లకు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.తారకరామారావు, గంప గోవర్ధన్‌, రమేశ్‌, భూత్పూరుకు ఎమ్మెల్యే సత్యనారాయణ, వినయ్‌భాస్కర్‌, విద్యాసాగర్‌రావు, సుధాకర్‌ రెడ్డి, కొత్తకోటకు డాక్టర్‌ రాజయ్య, కొప్పుల ఈశ్వర్‌, జోగు రామన్న, భిక్షపతి, ఆలంపూర్‌కు ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదెలు, అరవిందరెడ్డి ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు.