కిరణ్‌ సర్కారుకు గవర్నర్‌ షాక్‌

ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైలు తిప్పిపంపిన గవర్నర్‌
సందిగ్ధంలో సర్కారు
హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి):
జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని సీబీఐ ఓవైపు కోర్టులో మెమో దాఖలు చేయగా.. మరోవైపు, కిరణ్‌ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు నిరాకరిస్తూ ప్రభుత్వం పంపిన ఫైల్‌ను గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తిప్పి పంపారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని, న్యాయ నిపుణుల సలహా తీసుకొని మళ్లీ ఫైలును పంపాలని ప్రభుత్వానికి సూచించారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం పంపించిన ఫైలును గవర్నర్‌ రెండ్రోజుల క్రితమే వెనక్కు పంపినట్లు సమాచారం. ఆ ఫైలును క్షుణ్ణంస్త్ర
పరిశీలించాకే.. ధర్మాన ప్రాసిక్యూషన్‌ను తిరస్కరించాలన్న మంత్రివర్గ సిఫార్సును నరసింహన్‌ తిప్పిపంపినట్లు తెలిసింది. ప్రాసిక్యూషన్‌ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని గవర్నర్‌ ప్రభుత్వానికి సూచించారు. అలాగే, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులతో పాటు న్యాయ సలహా తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ప్రభుత్వానికి చుక్కెదురు..
వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ ధర్మానను నిందితుడిగా పేర్కొంటూ ఆగస్టు 7న కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. అయితే, రాజీనామాను ముఖ్యమంత్రి ఇంకా ఆమోదించనూ లేదు.. తిరస్కరించ లేదు. మరోవైపు, మంత్రి ధర్మానను ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతించాలని సీబీఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ అంశాన్ని చాలా కాలం నాన్చినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. చివరకు గత నెల 23న జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముందుకు తీసుకువచ్చారు. ధర్మానకు అండగా నిలబడాలని, ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకూడదని సీఎం ప్రతిపాదించగా.. మిగతా మంత్రులంతా మద్దతు పలికారు. మంత్రి డీఎల్‌ నర్సింహారెడ్డి మాత్రం ఈ నిర్ణయంతో విభేదించారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రే కానీ, క్యాబినెట్‌ కాదని స్పష్టం చేశారు. అయితే, ఆయన వాదనను పట్టించుకోవాల్సిన పని లేదని, మెజార్టీ అభిప్రాయం ప్రకారం ప్రాసిక్యూషన్‌కు అనుమతి
తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుందామని సీఎం కిరణ్‌ స్పష్టం చేశారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి తిరస్కరిస్తూ ప్రభుత్వం ఈ మేరకు గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే, ఆ ఫైలును పరిశీలించిన గవర్నర్‌ చివరకు తిప్పి పంపించారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని క్యాబినెట్‌ నెత్తికెత్తుకోవడం, దాన్ని గవర్నర్‌ తిరస్కరించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పుడేం చేయాలనే దానిపై సర్కారు మల్లగుల్లాలు పడుతోంది.
మళ్లీ పంపిస్తే ఆమోదించాల్సిందే…
ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైలును గవర్నర్‌ తిప్పి పంపించిన నేపథ్యంలో.. ప్రభుత్వం రెండో సారి పంపించే అవకాశం ఉంది. అదే ఫైలును ప్రభుత్వం తిప్పిపంపితే గవర్నర్‌ ఆమోదించక తప్పదు. ఈ మేరకు రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే, ధర్మాన వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. గవర్నర్‌ సూచించిన మేరకు ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటుందా? లేక, ప్రాసిక్యూషన్‌కు అనుమతి తిరస్కరించాలని అదే ఫైలును మళ్లీ పంపిస్తుందా? లేక, మళ్లీ క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే డీఎల్‌ వంటి వారు బహిరంగంగానే.. ప్రాసిక్యూషన్‌ వ్యవహారంలో మంత్రిమండలి జోక్యాన్ని వ్యతిరేకిస్తుండడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
కిరణ్‌ దూకుడుకు గవర్నర్‌ బ్రేక్‌..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గవర్నర్‌ నరసింహన్‌ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకూడదని పంపించిన ఫైలును తిప్పిపంపించి, ఊహించని రీతిలో షాకిచ్చారు. మరింత క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయ సలహా తీసుకొని ఫైలును పంపించాలని ఆదేశించారు. సీఎం కిరణ్‌ దూకుడుకు ఆది నుంచి గవర్నర్‌ బ్రేకులు వేసుకుంటూ వస్తున్నారు. పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును, పథకాల ప్రగతిని సవిూక్షిస్తూ కిరణ్‌కు కంట్లో నలుసుగా మారారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా నరసింహన్‌ తప్పుబట్టారు. విశ్వవిద్యాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. వీసీల నియామకాల విషయంలో గట్టిగా వ్యవహరించారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక విషయంలోనూ ప్రభుత్వం సిఫార్సు చేసిన రాజకీయ ప్రాబల్యం కలిగిన నాలుగు పేర్లను తిరస్కరించారు. తాజాగా ధర్మాన వ్యవహారంలోనూ ప్రభుత్వ నిర్ణయంతో విభేదించారు.