కిరణ్‌ సర్కారును కూల్చుదాం రండి

విపక్షాలకు కేసీఆర్‌ పిలుపు
అవిశ్వాసానికి తెరాస సై
హైదరాబాద్‌, మార్చి11(జనంసాక్షి) :
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలకొడదాం రండి అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విపక్షాలకు పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సమావేశంలో ఆయన పలు అంశాలను చర్చించారు. అసెంబ్లీలో అనుస రించాల్సిన వ్యూహంపై చర్చించారు. అవిశ్వాసంపై సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా, ఎంఐఎం పార్టీలను సంప్రదించామన్నారు. అవిశ్వాసానికి నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవిశ్వాసంతో ఎవరి రంగేంటో బయటపడ్తదని పేర్కొన్నారు. సర్కార్‌పై విమర్శలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రతిరోజూ కాంగ్రెస్‌ను తిట్టే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. పభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, కలిసివచ్చే వారెవరో అక్కడే తేలుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రమిస్తామని తెలంగాణ ప్రజలకు మోసగించిన కాంగ్రెస్‌ను కచ్చితంగా ఎండగడతామన్నారు. తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని సభను స్తంభింపచేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 21న సడక్‌బంద్‌లో శాసనసభ పక్షం పాల్గొనాలని నిర్ణయించామని ఆ వ్యవహారాలు ఈటెల రాజేందర్‌ చూసుకుంటారని కేసీఆర్‌ తెలిపారు. ఏడు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫర చేయాలని సభలో తీర్మానం చేస్తామన్నారు. పీఆర్సీ కాల వ్యవధి ఆరు నెలలకు కుదించి అమలు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని సీఎం కిరణ్‌ సర్కార్‌ రాచిరంపాన పెడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణపై నాన్చివేత దోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్‌ నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఇస్తామని పార్లమెంట్‌లో కూడా చెప్పి నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న కాంగ్రెస్‌ తీరును ఎండగట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. పది సంవత్సరాలుగా తెలంగాణ ఇస్తమని చెప్పి నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్‌, మంచినీటి సరఫరా సరిగా లేదన్నారు. బయటి రాష్టాల్ల్రో కరెంట్‌ అందుబాటు-లో ఉందని ట్రాన్స్‌కో అధికారులే చెప్తున్నారని కేసీఆర్‌ తెలిపారు. కరెంట్‌ లభ్యత ఉన్న సీఎం కిరణ్‌ సర్కార్‌ కొనకపోవడం దారుణమన్నారు. రైతులు, విద్యార్థులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ సమస్యపై సీఎం తక్షణమై స్పందించి కరెంట్‌ను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 24న తెలంగాణ జేఏసీ చేపట్టబోయే సడక్‌బంద్‌ను విజయవంతం చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు సడక్‌బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సడక్‌బంద్‌ బాధ్యతలను టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌కు అప్పగించినట్లు- ఆయన తెలిపారు. సడక్‌బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని తెలంగాణ సత్తాను చాటాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భేటీ అయిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం పలు తీర్మానాలు ప్రవేశపెట్టింది. తెలంగాణ రైతాంగానికి ఏడు గంటల విద్యుత్‌ ఇవ్వాలని, వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ను రద్దు చేయాలని, పదో పీఆర్సీ కాల వ్యవధిని ఆరు నెలలకు కుదించాలని టీఆర్‌ఎస్‌ తీర్మానం చేసింది. వ్యాట్‌ రద్దుకు టీఎర్‌ఎస్‌ అసెంబ్లీలో పట్టుబడ్తదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.