కివీస్‌పై 3-0 ఆధిక్యంతో విజయం

డెవిన్‌ కప్‌ గ్రూప్‌-1లో భారత్‌
డెవిస్‌ కప్‌లో భారత యువ టెన్నిస్‌ ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లకు సీనియర్‌ ఆటగాళ్లు దూరంగా ఉన్నప్పటికి యువకులు తమ ప్రతిభను చూపించి విజయం సాధించారు. ఫలితంగా డెవిస్‌ కప్‌ గ్రూప్‌-1లో భారత్‌కు చోటు దక్కింది. ఆసియా/ఓషియానా జోన్‌ గ్రూప్‌-1లో చోటు కోసం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు విష్ణు వర్ధన్‌ సింగిల్స్‌, డబుల్స్‌ రెండింటిలోనూ పైచేయి సాధించడంతో భారత్‌ 3-0 ఆధిక్యంతో ప్రత్యర్థిపై భారీ విజయం సాధించింది. దీంతో భారత్‌ తిరిగి డేవిస్‌ కప్‌లో గ్రూప్‌ -1లో చోటు దక్కించుకుంది. ఈ పోటీలో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి సింగిల్స్‌లో ఢిల్లీ స్టార్‌ యుకీ భాంబ్రీ గెలుపొందగా, వెలుతురు లేమి కారణంగా ముగిసిన రెండో సింగిల్స్‌లో ఏపీ సంచలనం విష్ణు 6-2, 6-7(5), 6-4, 6-2తో కివీస్‌ నెంబర్‌ వన్‌ జోస్‌ స్టేథమ్‌ను ఓడించి నెంబర్‌ భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 3 గంటల 52 నిమిషాల పాటు సాగిన మారథాస్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో దివిజ్‌ శరణ్‌ జతగా విష్ణు 7-6(3), 4-6, 6-3, 6-7(4), 6-3తో కివీస్‌ ద్వయం మైకేల్‌/డేవియల్‌ – టర్నర్‌పై గెలుపొందాడు. దీంతో ఆదివారం జరగాల్సిన రివర్స్‌ సింగిల్స్‌ పోరుతో సంబంధం లేకుండానే భారత్‌ 3-0తో స్పష్టమైన ఆధిక్యంతో గ్రూప్‌-1లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
మహేష్‌ భూపతి – రోహాన్‌లపై ఏఐటీఏ రెండేళ్ల నిషేదం
డెవిస్‌ కప్‌లోని భారత యువ టెన్నిస్‌ ఆటగాళ్లు చూపించిన తెగువ, ప్రతిభ ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ (ఏఐటీఏ)కు వేయి ఏనుగుల బలం వచ్చినట్టు కనిపిస్తోంది. ఫలితంగా.. తమకు పలు మార్లు తలనొప్పులు కలిగించిన సీనియర్‌ టెన్నిస్‌ ఆటగాళ్లు మహేష్‌ భూపతి, రోహాన్‌ బోపన్నలపై రెండేళ్ల పాటు నిషేదం విధించినట్టు మీడియా కథనాలు వస్తున్నాయి. వచ్చే రెండేళ్లలో ఎలాంటి మ్యాచ్‌లకైనా దేశం తరపున పాల్గొనే జట్లకు వీరద్దరిని ఎంపిక చేయరాదని ఏఐటీఏ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డెవిస్‌ కప్‌ కోసం ఎంపిక చేసే భారత జట్టులో యువకులకే పెద్దపీట వేయడంతో పాటు మహేష్‌ భూపతి, రోహాన్‌ బోపన్నలను పక్కన పెట్టాలని ఈ నిర్ణయంపై ఖచ్చితంగా నిలబడాలని భావిస్తోంది.