కులాల కుంపట్లను రగిలిస్తున్న వారంతా దోషులే!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ అనే యువకుడి పరువు హత్య ఇప్పుడు పలు మౌలిక సమస్యలను సమాజం ముందుంచింది. కుల దురహంకారంపై నినదించింది. కులాలు ఏంటన్న ప్రశ్నను స్వయంగా బాధిత యువతి అమృతవర్షిణి ప్రశ్నిస్తోంది. నిజానికి గతంలో పాతకాలంలో కూడా లేనంతగా ఇప్పుడు కులాల కుంపట్లు రగులుతున్నాయి. రాజకీయా నాయకుల ఓట్ల వేటలో కులాలు చీలిపోతున్నాయి. కులసంఘాలను పెంచి పోషిస్తున్న వారు ప్రధానంగా రాజకీయ పార్టీల నేతలే. కులాల వారిగా సంఘాలను ప్రోత్సహిస్తూ ఆర్థిక తాయిలాలను ప్రకటిస్తూ సమాజంలో అశాంతికి కారణం అవుతు న్నారు. సమాజం కలిసి ఉందామన్నా రాజకీయ పార్టీలు, నేతలు కలిసి ఉండేలా లేకుండా చేస్తున్నారు. కులాల పేరువిూద సీట్లు.. ఓట్లు లెక్క గడుతున్నారు. గ్రామాల్లో కులసంఘాలు..కులాలకు భవనాలు.. లేకుండా ఉండడం లేదు. ఇంతగా సమాజం దిగజారిపోయేలా చీల్చి చెండాడుతున్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలి. అలాంటి వారికి బుద్ది చెప్పాలి. సమాజంలో ఓ రకంగా కులసంఘాలు అనైక్యతకు కారణం అవుతున్నాయి. కులాల పేరుతో అభద్రత ఏర్పడుతోంది. వాడు ఫలానా కులం అన్నది గతం కన్నా ఇప్పుడు పెరిగింది. ఇంతగా కులదురహంకారం పెరిగిపోవడం వల్లనే ప్రణయ్‌ లాంటి అమాయకులు దారుణంగా హత్యకు గురవుతున్నారు. తమ పరువు పోయిందంటూ సమాజాంలో కొందరు లేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇది మరీ దారుణమైన స్థితికి చేరుకుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గ్రామాల్లో కులరాజకీయాలు ప్రభావం చూపుతున్నాయి. అందుకే ప్రేమ వివాహాల్లో కుటుంబాలు తట్టుకో లేనంతగా కులాల చిచ్చు రేగుతోంది. ఇందుకు ప్రతక్ష్య ఉదాహరణ ప్రణయ్‌ హత్య. దేశమంతా ఇలాంటి దుస్థితి ఉంది. కులాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలంతా ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలి. రాజకీయాల్లో కులాలను పెంచి పోషిస్తున్న వారు ప్రేమ పెళ్లిళ్ల సమయంలో దారుణాలు జరిగినప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల పేరున సీట్లు కేటాయిస్తూ..ఓట్లు అడుగుతున్న నేతలు కులాల కుంపట్లను ఎలా చల్లార్చగలరు. మానవత్వం కంటే కులం, మతం ఎక్కవ అని భావించే వారి సంఖ్యపెరిగి పోవడానికి..సమాజంలో ఇలాంటి జాడ్యం పెంచడానికి రాజకీయ పార్టీలు, వాటి నేతలు కారణమని చెప్పడంలో ఎలాంటి భయం అక్కర్లేదు. కుల, మతాలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ ప్రణయ్‌ చావుకు కారకులే. కుల, మతాల ఘర్షణలు దేశాన్ని కుదిపి వేయడం దారుణమైనవిగా చూడాలి. ఓట్ల కోసం కులాలను ప్రోత్సహిస్తున్న వారు సమాజం ఏమవుతుందో అన్న భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉంటున్నవారందరికీ పీల్చే గాలి, దేహం ఒకటే, అందరిలోనూ రక్తం ఒకటే అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న వారు మారాలి. అందరం ఒక్కటే అని చెబుతున్న వారు కులం పేరుతో ఇతరుల ప్రాణాలు తీసే హక్కు వారికి ఎవరిచ్చారు. మారుతీరావు లాంటి వారు ఊరికి పదిమంది పుట్టుకుని రావడం వెనక కుల సంఘాలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులే బాధ్యులు. కుల, మతాలకు మద్దతు తెలిపేవారందరూ మిర్యాలగూడ ఘటనకు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రణయ్‌ను చంపిన వారే కాదు..కులానికి మద్దతు తెలిపేవారందరూ ఈ హత్య కేసులో నిందితులే. కుల రాజకీయాలను అంతం చేయకపోతే క్యాన్సర్‌ జబ్బులా అది సమాజాన్ని సర్వ నాశనం చేయడం ఖాయం. ఈ కులాలు, పరువు హత్యలు మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వేళ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఒక్కగానొక్క కుమార్తెను ఎంతో అపురూపంగా చూసుకుని, ఆమె ఇష్టాయిష్టాలను అర్ధం చేసుకుని నెరవేర్చవలసిన కన్నతండ్రే కాల యముడిగా మారి ఆమె మనువాడినవాడిన వాడిని మట్టుబెట్టిన ఘటన వెనక సమాజంలో వేళ్లూనుకున్న

కుల విభజనలే కారణం. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందుతున్న వారు సైతం కులాంతర వివాహాలు జరిగే సందర్భాల్లో మాత్రం ప్రేమలను అంగీకంచడం లేదు. ఏటా వందలాదిగా బలవుతున్నా వీటిని నియంత్రించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. కులాల పేరుతో సీట్లను,ఓట్లను అడిగే వారిని దగ్గరకు తీయడం మానేయాలి. అలాంటి వాటిని చూపి ఓట్లను అడిగే రాజకీయ పార్టీలను తరిమికొట్టాలి. మా కులం వాడే మంత్రి కావాలనో..సిఎం కావాలనో లేదా ఎమ్మెల్యే కావాలనో డిమాండ్‌ చేసే వారిని నీచులుగా చూడాలి. కులసంఘాలు పెట్టి పోరాడే వారిని దూరం పెట్టాలి. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో మారుమూల పల్లెల్లో మాత్రమే పరువు హత్యలు జరిగేవి. ఇప్పుడు పరువు హత్యలకు అడ్డు లేకుండా పోతోంది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు ఆదర్శంగా ఉందామనుకున్నా, కులాల జాడ్యంలో మగ్గిపోతున్న సమాజం వారిని బతకనీయడం లేదు. కనుకనే ప్రణయ్‌, అమృతలు వివాహం చేసుకున్నా వారి ప్రేమను తండ్రి అగీకరించలేక పోయాడు. అందుకే ఆ జంట నిర్మించుకున్న అందమైన గూడు కూలిపోయింది. కొన్నేళ్లక్రితం సుప్రీంకోర్టు ఈ మాదిరి హత్యల విషయంలో కఠినంగా వ్యవహరించి, దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని తెలిపింది. కానీ పట్టించు కున్నవారేరి? తోటి మనిషిని కుల చట్రంలో తప్ప చూడలేనివారు మనుషులెలా అవుతారని మనమంతా ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ప్రణయ్‌ హత్యను వ్యతిరేకించే వారంతా కులరాజకీయాలను గట్టిగా తిప్పికొట్టాలి. రాజకీయ పార్టీలకు బుద్ది వచ్చేలా చేయాలి. సమాజంలో అశాంతికి కారణమవుతున్న కులసంఘాలను దూరంగా పెట్టాలి. కులాల పేరుతో రాజకీయాలను తరిమికొట్టాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. అసమానతలు తొలగిపోతాయి.