కూడంకుళానికి ‘సుప్రీం’ పచ్చజెండా

న్యూఢిల్లీ, మే 6 (జనంసాక్షి) :
వివాదాస్పదమైన కూడంకుళం అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రాజెక్టును కొనసాగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. అణు విద్యుత్‌ కేంద్రంలో మొత్తం 17 భద్రతా చర్యలు తీసుకొనే వరకూ ప్లాంట్‌ను కొనసాగించకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను సోమవారం తోసిపుచ్చింది. ప్లాంటు పూర్తి సురక్షితమైనది, భద్రత కలిగినదని స్పష్టం చేసింది. 17 భద్రతా చర్యల్లో 12 ఇప్పటికే అమలు చేశారని.. మిగిలిన భద్రతా చర్యలను కూడా త్వరలోనే అమలు       చేసేందుకు ప్రభుత్వం హావిూ ఇచ్చిందని పేర్కొంది. ప్రాజెక్టు భద్రతపై వేసిన కమిటీలన్నీ ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయని జస్టిస్‌ కేఎస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ దీపక్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గానీ, కాలుష్యం పెరుగుతుందని నిపుణుల కమిటీలు చెప్పలేదని స్పష్టం చేసింది. భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలకు అణు విద్యుత్‌ అవసరమని తెలిపింది. మిగతా వాటితో పోలిస్తే అణు విద్యుత్‌ చాలా తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. జాతీయ ప్రయోజనాలతో పాటు ఆర్థికాభివృద్ధికి అణువిద్యుత్‌ అవసరమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు గత డిసెంబర్‌ 6న రిజర్వ్‌ చేసిన తీర్పును ధర్మాసనం సోమవారం వెలువరించింది. కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని పిటిషనర్‌ ఆరోపించారు. అలాగే, చట్టప్రకారం ప్రాజెక్టు ఏర్పాటు చేసే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉండగా ఆ  మేరకు వ్యవహరించాలేదని తెలిపారు. అలాగే 1989లో ప్రాజెక్టు పర్యావరణ శాఖ అనుమతి పొందినప్పటికీ, అప్పట్లో ఎక్కడ నిర్మించేది పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణానికి విఘాతం కల్పించే కూడంకుళం ప్రాజెక్టులో పూర్తి భద్రతా చర్యలు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, ఆయన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు అవసరమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే కుడంకుళం వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.