కూర్చుంటే కుదరదు కవాతు చేయాల్సిందే…!
తెలంగాణ నాలుగున్నర కోట్ల ఆశ…శ్వాస..తెలంగాణ ఓ బతుకు పోరాటం…ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు.. పోరాడాల్సిన సమయం..పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న సూక్తే మనకు ఆదర్శం…తెగించి కదన రంగంలో దూకి తెలంగాణకై పోరాడాలి..తెలంగాణ వాసులకు పోరాటాలు కొత్తకాదు.. సాయుధ రైతాంగ పోరాటం మొదలు ఈ మధ్య సకలజనుల సమ్మె వరకు పోరాట రూపాలు ఏవైనా తమ బతుకు కొరకు..స్వయం పాలన కొరకు ఆత్మ గౌరవం కొరకు… బానిస సంకెళ్లను తెంచడానికి తెలంగాణ వాసులకు పోరాటం తప్ప వేరే దారి లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత సీమాంధ్ర దగాకోరు తనాన్ని భరించలేక విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ప్రజలు అన్ని వర్గాల వారు ఎదురు తిరిగారు… తిరుగుతూనే ఉన్నరు. అయితే 2009లో జరిగిన తీవ్ర ప్రజాందోళనతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ ప్రకటించింది. అయితే బంగారుబాతు అయిన తెలంగాణను వదిలి పెట్టడం ఇష్టంలేని సీమాంధ్ర నాయకులు లాబీయింగ్ చేసి వచ్చే తెలంగాణను అడ్డుకొన్నారు. అయినా సీమాంధ్ర నాయకుల బుద్దెరిగిన తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యం కోల్పోలేదు. దీంతో ఎలాగైనా తెలంగాణ వాదుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే సీమాంధ్ర నాయకులు పెంచి పోషిస్తున్న సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కొద్ది రోజులు మౌనంగా ఉంటే చాలు ఉధ్యమం చల్లబడ్డది అంటూ కారు కూతలు కూస్తది…అపుడెపుడో తెలంగాణ ఉధ్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో అంటూ విషపు ప్రచారం చేస్తది. తెలంగాణ ఉద్యమం ఈ నాటిది కాదు..కాలగమనంలో ఉద్యమ తీరుతెన్నులు మార్చుకొంటూ ప్రపంచంలో విజయవంతమైన విప్లవాల స్పూర్తితో ముందుకు దూసుకెళ్తరు. ఉద్యమ కార్యాచరణను రూపొందించు కొనేందుకు మౌనంగా ఉంటరు. అంతే తప్ప నిజమైన, మట్టిలోంచి పుట్టిన ఉద్యమ ఉధృతి తగ్గదు. అలా తగ్గడానికి వారిలా ఇది పెట్టుబడిదారుల ఉద్యమం కాదు…ఆకలి కేకల పోరాటానికి అలుపన్నది ఉండదు. అసత్య ప్రచారాలు, అర్దం పర్దం లేని వాదనలు ఎక్కువ కాలం నిలబడవు..ఇక ఘనత వహించిన ఓ సీమాంధ్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణపై అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని, ఇక బంతి కాంగ్రెస్ కోర్టులోనే ఉందని..తెలంగాణకు డార్జిలింగ్ తరహా ప్యాకేజీని అధిష్టానం ప్రకటించే అవకాశాలున్నాయని ప్రకటించేశారు…అయితే ఆయనకు తెలియని(?) విషయం ఒకటుంది..తెలంగాణ వాదులు ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడుతున్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే కానీ..ప్యాకేజీపొట్లాల కోసం..పుట్నాలు బఠానీల కొరకు కాదు..మండలిలు, ప్యాకేజీలు అన్నవి పాత ప్రయోగాలే..ఇవి విజయవంతమైన దాఖలాలు లేవు..అసలు తెలంగాణ కలిసిందే కొన్ని షరతుల మీద..అవి అమలవకపోతే విడిచిపోవచ్చని నెహ్రూ ఆనాడే చెప్పారు పెద్ద మనుషుల ఒప్పందం..ఆరు సూత్రాల పథకం..ఇలా ఎన్నో విఫలమైన జాబితాలో చేరిపోయాయి. మళ్లీ ఇపుడు మండలి, ప్యాకేజీలంటూ ప్రయోగాలు చేస్తామంటే కుదరదు..తెలంగాణ వాదుల ఓపిక నశిస్తోంది. తెలంగాణమార్చ్‌తో మరోసారి ప్రపంచ ఉద్యమాల చరిత్రలో మరో ఉద్యమాన్ని నిలిపేందుకు తెలంగాణవాదులు ఉత్సాహంగా ఉన్నారు. కూచుంటే కుదరదు చెల్లీ…కొంగు నడుముకు చుట్టు తల్లీ..అన్నట్లుగా తెలంగాణవాదులు ఇంకా ఉధృతంగా ఉద్యమించాలి.. ఉద్యమిస్తారు…కాబట్టి మళ్లీ ఇలాంటి ప్రయోగాలు పనికిరావు..తెలంగాణ ఏర్పాటే ఏకైక లక్ష్యం…..