కెసిఆర్‌ కిట్‌తో పెరిగిన ప్రసవాలు

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆందోళన
నల్గొండ,అక్టోబర్‌5 (జనంసాక్షి):  కెసిఆర్‌ కిట్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికితోడు ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ పేరుతో రూపొందించిన కిట్టు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తరవాత  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే గర్భిణుల సంఖ్య, ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే ఆసుపత్రిలో రక్ష పరీక్షలు చేయించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. నల్గొండ జిల్లా ఆసుపత్రికి నిత్యం 80 నుంచి 100 మంది గర్భిణులు వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. వీరిలో 90 శాతం గర్భిణులకు రక్త పరీక్షలు అవసరమని వైద్యులు చీటీలు రాస్తున్నారు. రక్తపరీక్షల వార్డు విభాగానికి వెళ్లిన గర్భిణులకు నరక యాతన తప్పడం లేదు. జిల్లా కేంద్రాసుపత్రిలో రక్త పరీక్షలు పెద్ద పరీక్షగానే మారాయి. చిన్న పాటి రక్త పరీక్షల ఫలితానికి కూడా మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతోంది. మరి కొన్ని రకాల పరీక్షలకు ఫలితం రావడానికి వారం పాటు వేచి చూడాల్సి వస్తోంది. ఈ లోపు బాధితులకు రోగం రెట్టింపు కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో పరీక్షలు చేసి ఫలితాలు ఇవ్వడానికి కొన్నింటికి గంటల సమయం, మరి కొన్నింటికి రోజు వరకు పడుతోంది. జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి
వచ్చిన వారికి రక్త పరీక్షల ఫలితం అందే సరికి రోజులు గడుస్తున్నాయి. కొంత మంది గర్భిణులు నెలలో రెండు సార్లు రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రాసుపత్రిలో థైరాయిడ్‌ పరీక్షలు చేసే పరికరాలు ఒక్కటి కూడా లేవు. ఆసుపత్రిలో మైక్రోబయాలజీ పరికరాలు అందుబాటులో ఉన్నా రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు సరిగా చేయడం లేదు. ఇవి చేస్తే రోగులకు వచ్చిన వ్యాధికి ఎలాంటి మందు వేయాలి, యాంటీబబయాటిక్స్‌ మాత్రలు వాడడం వల్ల ఎన్ని రోజుల్లో వ్యాధి తగ్గుతుంది అనే విషయాలు తెలుస్తాయి. కానీ ఇక్కడ ఒక్కరికి కూడా రక్తం కల్చర్‌ చేయక పోవడం వల్ల సరైన మందులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి రక్త పరీక్షల సమస్యలు పరిష్కారం మార్గం చూపాల్సిన అవసరం ఉంది. పరీక్షల ఫలితాలు వెంటనే ఇవ్వకుండా మూడు రోజుల వరకు జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తుంది.