కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు

ప్రచారం మాత్రం టిఆర్‌ఎస్‌ది: బిజెపి

నల్లగొండ,ఫిబ్రవరి2 జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే కాకుండా నిధులన్నింటీకి తామే అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పెత్తనం చెలాయిస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు ఆరోపించారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యా, వైద్యం, రహదారులు, మౌలిక సదుపాయాలు అందించేందుకు వేల కోట్ల నిధులను అందిస్తోందన్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం వాటిని తామే ఖర్చుచేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం ప్రజలను పక్కదోవ పట్టించడమే అవుతుందన్నారు. ఇలా అందించిన నిధులతోనే 2014-15 వరకు అన్నిపాఠశాలల్లో స్వచ్ఛమరుగుదొడ్లను నిర్మించారన్నారు. వ్యక్తిగత స్వచ్ఛ మరుగుదొడ్ల నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వానికి రూ.500కోట్లు అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఇంకా ఎల్‌పీజీ గ్యాస్‌లేకుండా 20లక్షల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. భాజపా ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వారందరికీ ఉచితంగా గ్యాస్‌కనెక్షన్లు అందించనుందన్నారు. పంటల ఖర్చును లెక్కించి అందుకు తగ్గట్టుగా రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఆహారపంటలతో పాటు వాణిజ్య పంటలకు మద్దతుధరను అందిస్తామన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి 90శాతం నిధులను రాష్ట్రానికి అందిస్తుంటే గ్రామపంచాయతీ భవనాలకు గులాబీ రంగు పూసి తామే అభివృద్ధి చేస్తున్నామంటూ తెరాస ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తుందన్నారు. గ్రామస్వరాజ్‌ అభియాన్‌ పథకాన్ని ప్రజలు ఉపయోగించుకునేలా చైతన్యవంతం చేయాలని నాయకులకు సూచించారు.