కేజీ టు పీజీ విద్యలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి
నగర సమస్యలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, జనవరి 16, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య అమలుకు సంబంధించి విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులతో ఈ నెల 27న సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, తదితరులతో సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో కేజీ టూ పీజీ ఉచిత విద్యపై ఈనెల 27వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నుట్టు తెలిపారు. సదస్సు ద్వారా అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి ఉచిత విద్యపై విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనపై కూడా అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. 1998 నుంచి పెండింగ్ లో ఉన్న డీఎస్సీ అభ్యర్థుల వినతులపై సానుకూలంగా స్పందిస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. దీంతోపాటు ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరానికి సంబంధించి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం కేటాయించిన స్థలంపై సవిూక్షించిన ఆయన 532 ఎకరాల్లో చాలా స్థలం ఖాళీగా ఉందని తెలిపారు. దానిపై అధ్యయనం చేసి, అవసరమైతే ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అంతేకాక వనస్థలిపురంలో ఉన్న హరిత వనస్థలి జింకల పార్కును రక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్కు స్థలం దురాక్రమణ కాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పార్కు పరిరక్షణకు స్థానికులతో కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. ఎంపీ లాడ్స్ నుంచి దీనికి నిధులు కేటాయించేలా చూస్తామన్నారు. కేబీఆర్ పార్కు తరహాలో బొటానికల్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు. దీంతో పాటు నగర మంచినీటి వ్యవస్థపై సీఎం సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.