కేబినెట్‌ సమావేశంలో మంత్రుల మాటల యుద్ధం

స్వపక్షంలోనే విపక్షం

జలయజ్ఞం వేస్ట్‌ అన్న జానా,

మండిపడ్డ పొన్నాల

ఉద్యోగుల కరువుభత్యం పెంపు

స్థానిక సంస్థలో గెలుపు భారం మంత్రులపైనే..

‘బంగారుతల్లి’కి ఆమోదం

హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) :

కేబినెట్‌ సమావేశం మంత్రుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా నిలిచింది. మూడునెలల తర్వాత ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమారు 27 అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేబినెట్‌లో మంత్రులను వర్గాలుగా విభజించిన బంగారుతల్లి పథకంపై సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. బొత్స సత్యనారాయణ, జానారెడ్డిలు ముఖ్యమంత్రి వైఖరిపైన పథకంపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేసినా కూడా మంత్రులు ఒక్కరొక్కరుగా వ్యతిరేకతను చెప్పారు. దీంతో బంగారు పథకంపై క్యాబినెట్‌ సబ్‌కమిటీ వేయాలని నిర్ణయించారు. డీఎల్‌ చేసినట్లుగానే వ్యాఖ్యలు ప్రతిమంత్రులు తెలిపినట్లు సమాచారం. డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌ వ్యవహారంలో కూడా చాలా మంది మంత్రులు సీఎం వైఖరిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు కఠినంగాను, కచ్చితమైన సమాచారం తీసుకుని రావాలని సీఎం ఆదేశించారని సమాచారం. మంత్రులు చాలామంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తయారు కావడంతో ఏమి చేయలేకపోయిన ముఖ్యమంత్రి సబ్‌కమిటీలో సందేహాలు తీర్చుకోవాలని ఏకైక వ్యాఖ్యంతో చర్చను ప్రక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సబ్‌కమిటీలో ఎవరెవరు మంత్రులుంటారనే అంశంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌ వ్యవహారంలో కూడా సీఎం వైఖరిని పలువురు మంత్రులు తప్పుపట్టినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ప్రతిఘటించేందుకు పోలీసులకు విశేషాధికారాలు కూడా ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ముందు ప్రజల్లో తెలంగాణ అంశం కేంద్రం పరిధిలోనిదని తాము ఏమి చేయలేం కాబట్టి ఆందోళనలు, ముట్టడి కార్యక్రమంపై ప్రజల్లోకి వెళ్లాలని సీఎం తెలంగాణకు చెందిన మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. ఆరోగ్యశాఖలో 748 పోస్టులను భర్తీ చేసేందుకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి వేతనాలు పెంచాలని, వస్త్రాలపై వ్యాట్‌ తొలగింపుపై క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల కరువు భత్యం పెంపునకు సమావేశం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ను రెండుగా విభజించాలని కూడా క్యాబినెట్‌ తీర్మానించింది. బంగారు తల్లి పథకం మాత్రం క్యాబినెట్‌ను రెండువర్గాలుగా మరింత దూరంచేసిందని చెప్పవచ్చు. పథకాన్ని ఎవరిని అడిగి ప్రకటించారని సీనియర్‌ మంత్రులు నిలదీయడంతో ఆయన వర్గీయులు అడ్డు తగులుతూ ముఖ్యమంత్రికి ఎన్నో విచక్షణాధికారాలుంటాయని వాటిని ప్రశ్నించడం సరైంది కాదని ప్రతిఘటించినట్లు సమాచారం. అయితే ఈవిషయం కాస్తా చిలికిచిలికి గాలివానలా మారిందని సమాచారం. జలయజ్ఞం వృథా ప్రయాస అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి వ్యాఖ్యానించగా ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆయనతో తీవ్రంగా విభేదించారు. జలయజ్ఞంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యతను మంత్రులే స్వీకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలని సూచించారు.