కేవీపీని ఎనిమిది గంటలు ఎడాపెడా వాయించిన సీబీఐ

వైఎస్సార్‌ ఆత్మకు ఇక కటకటాలేనా?
హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రారావును సీబీఐ శనివారం ఎనిమిది గంటలపాటు విచారించింది. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో ఆయనను ప్రశ్నించేందుకు హాజరుకావల్సిందిగా సీబీఐ ఆదేశించింది. ఈ మేరకు ఆయన ఈ ఉదయం 11 గంటలకు దిల్‌కుషా గెస్ట్‌ హైస్‌లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. వైఎస్‌ హయాంలో కేవీపీ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ ఆస్తుల వ్యవహారంపై కూడా కేవీపీకి పూర్తి సమాచారం, అవగాహన ఉండి ఉంటుందని సీబీఐ భావిస్తోంది. అలాగే వైఎస్‌ హయాం నుంచి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేవీపీ ఏం చెబుతారోననే దానిపై ఎంతో     ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ ఆస్తుల కేసుకు సంబంధించి పలువురు అధికారులు, మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవీపీని సీబీఐ విచారించడం తో ఆసక్తి నెలకొంది. జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు శనివారం ఉదయం రాజ్యసభసభ్యుడు కేవీపీ రామచంద్రారావు సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లాయర్ల జేఏసీ ఆధ్వర్యంలో సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతికి కేవీపీదే ప్రధాన బాధ్యత అని, ఆయనను అరెస్టు చేయాలని టీ లాయర్లు డిమాండ్‌ చేశారు. దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణ జరుగుతుండగానే మరోవైపు బయట లాయర్లు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాలకు మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. అన్నింటిలో సగం, అవినీతిలో సగమైన వైఎస్సార్‌ ఆత్మ కేవీపీని అరెస్టు చేయాలంటూ రాసి ఉన్న ప్లకార్డులు ధరించి టీ లాయర్లు ఆందోళనలో పాల్గొన్నారు. కేవీపీని అరెస్టు చేయాలంటూ లాయర్లు నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో సీబీఐకి వినతి పత్రం ఇచ్చేందుకు ఇద్దరు ప్రతినిధులను పోలీసులు అనుమతించారు. మిగిలిన వారిని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, కేవీపీని విచారిస్తుండటంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.  ఎన్ని గంటలకు వెళ్లారు.. ఏమని చెబుతారు.. సీబీఐ  ఆయనను ఏమని ప్రశ్నిస్తుంది?.. ఏం జరగబోతుంది? అంటూ పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరినొకరు ప్రశ్నించుకోవడం కనిపించింది. ఎప్పటికైనా వైఎస్‌ ఆప్తమిత్రుడైన కేవీపీ కటకటాలకు వెళ్లాల్సి వస్తోందో ఏమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.