కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే అపవిత్ర కూటమి కట్టారు
– కూటమిలో సీట్లు పంచేది రాహుల్.. కోట్లు ఇచ్చేది చంద్రబాబు
– ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలే..
– తెరాసకు ఓటుగుద్ది కూటమికి బుద్దిచెప్పండి
– బయ్యారం కల నెరవేరుస్తాం
– కేంద్రం ముందుకురాకుంటే మేమే ఉక్కు పరిశ్రమను నెలకొల్పి తీరుతాం
– మహబూబాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్
మహబూబాబాద్, నవంబర్3(జనంసాక్షి) : కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తాలేకనే, రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టేలా కాంగ్రెస్, టీడీపీలు పొత్తులు పెట్టుకున్నాయని, అలాంటి అపవిత్ర పొత్తులతో ప్రజల ముందుకొస్తున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కూటమిలో సీట్లు పంచేది రాహుల్ గాంధీ అయితే.. నోట్లు పంచేది చంద్రబాబు అని.. కానీ ఓట్లు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలన్నారు. అందుకే ప్రజలందరూ ఆలోచించి ఓటేయ్యాలని, తెలంగాణను వంచించేందుకు చంద్రబాబు, రాహుల్ గాంధీ దోస్తీ కట్టారని వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు రాజకీయాల్లో నీతి నిజాయితీలు అనేవి లేవన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెదేపాను స్థాపిస్తే.. ఇప్పుడు చంద్రబాబు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. సోనియాను గాడ్సేతో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖంతో కాంగ్రెస్ ముందు మోకరిల్లాడని ప్రశ్నించారు. దశాబ్దాల నుంచి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అపారమైన ఇనుప గనులు ఉన్నాయని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ డిమాండ్ ఉందని కేటీఆర్ అన్నారు.
కేంద్రం స్పందించినా.. స్పందించకపోయినా.. ఉక్కు పరిశ్రమను నెలకొల్పి తీరుతామని ఉద్ఘాటించారు. పొరపాటున కూటమికి ఓటేస్తే నిర్ణయాలన్నీ అమరావతిలోనే ఉంటాయని, రైతన్నలు ఆలోచించి ఓటేయ్యాలన్నారు. కూటమికి ఓటేస్తే.. రైతులకు ఇబ్బందులు పడుతారని, ప్రాజెక్టులను అడ్డుకొని వ్యవసాయానికి నీరు రాకుండా చేస్తారని విమర్శించారు. మాయకూటమి అధికారంలోకి వస్తే ఒక్క ప్రాజెక్టును కూడా చంద్రబాబు కట్టనివ్వడని, పేదప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్ నేతలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించాలని ప్రతిపక్షాలు పిలుపునివ్వడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టినందుకు కేసీఆర్ ను దించేయాలా? గత 70ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేని పనులను టీఆర్‌ఎస్ నాలుగేళ్లలో చేసి చూపిందని ఇందుకోసం గద్దె దించేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ప్రతిపక్షాల వద్ద సమాధానాలు ఉండవన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.