కేసీఆర్‌వి అనైతిక రాజకీయాలు

1AA
– సీఎల్పీ నేత జానారెడ్డి

ఖమ్మం,మే12(జనంసాక్షి): తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అయినా, తమ పార్టీ నేతలను నిస్సిగ్గుగా టిఆర్‌ఎస్‌లో చేర్చుకుని కృతఘ్నత చాటుకున్నారని సిఎం కెసిఆర్‌పై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. పాలేరులో పోటీ చేయాల్సిన అవసరం టిఆర్‌ఎస్‌కు ఏమొచ్చిందన్నారు. తాము పాలేరులో గెలిచినంత మాత్రాన ప్రభుత్వాన్ని పడగొట్టలేం కదాని అన్నారు. మాజీమంత్రి గీతారెడ్డితో కలసి ఆయన విూడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాటం చేసింది కాంగ్రెస్‌ నేతలని వారు పేర్కొన్నారు. కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. ఈ గెలుపు ద్వారా ప్రజాస్వామ్యానికి విలువ పెంచాలన్నారు. బంగారు తెలంగాణ కాదు, భయభ్రాంతుల తెలంగాణ తయారవుతోందని జానారెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్‌ నేతగా కెసిఆర్‌ ఇరవై ఏళ్లు పోరాడినా తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించే సోనియాగాందీ తెలంగాణ రాష్టాన్న్రి ఇచ్చారని ఆయన చెప్పారు. కాని కెసిఆర్‌ అదికారంలోకి వచ్చి వాగ్దానాలను అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తెలంగాణను అప్రతిష్ట పాలు చేశారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి, భయభ్రాంతుల తెలంగాణను తీసుకువస్తున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో తెరాస నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని జానా  విమర్శించారు. పాలేరులో తెలంగాణ వాది అయిన రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిపై తుమ్మల నాగేశ్వరరావును పోటీ పెట్టడం ఎంత వరకు సమంజసం ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో నూతన ఒరవడి ఉంటుందని ఉహించామని.. అందుకు భిన్నంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చిన సమయంలో సోనియాగాంధీని కలిసి దేవత అని పొగిడిన విషయాన్ని మరిచిపోయావా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో తెరాసకు న్యాయస్థానంలో వ్యతిరేక తీర్పు వస్తుందని.. అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పారు. పార్టీలు ఫిరాయించిన పువ్వాడ అజయ్‌కుమార్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞత లేకుండా పోయిందన్నారు.  నీతికి అవినీతికి, మంచికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నికలో ఓటరు విలువైన తీర్పు ఇవ్వాలన్నారు. పదమూడేళ్లపాటు మంత్రిగా ఉండి పాలేరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలిపిస్తే అభివృద్ధి చేస్తానంటూ పాలేరు ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని గీతారెడ్డి ఆరోపించారు.  కాంగ్రెస్‌ను పాతరేయాలని మంత్రి కేటీఆర్‌ మాట్లాడున్నారని ఆక్షేపణ వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ను పాతరేయడం ఎవ్వరితరం కాదన్నారు. కాంగ్రెస్‌ ఏంచేసిందని ప్రశ్నిస్తున్న కేటీఆర్‌, ఆయన తండ్రి కేసీఆర్‌ అధికారం చెలాయించేందుకు తోడ్పడ్డ తెలంగాణ రాష్టాన్న్రి ఇచ్చిందెవ్వరో గుర్తెరగాలన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఇప్పటికే 70వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని కూరగాయల్లా కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు రీడిజైన్‌ల పేరిట ప్రభుత్వం అక్రమార్జనకు పాల్పడుతోందన్నారు. ఇదే డబ్బును ఎన్నికల్లో పంచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు.