కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

హైద‌రాబాద్ – తెలంగాణ విప‌క్ష నేత , బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్ళను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో తెలిపారు.2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారని, ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచారని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు.శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పారు. ప్రతివాదులుగా కేసీఆర్, కేటీఆర్ లతో పాటు స్పీకర్, స్పీకర్ కార్యాలయాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.