కొత్త మిత్రులవైపు యూపీఏ చూపు

హోదా ఇస్తే సై అంటున్న నితీశ్‌
సంకేతాలు పంపుతున్న జయ
మమత విషయంలో వేచిచూసే ధోరణి
న్యూఢిల్లీ, మార్చి20 (జనంసాక్షి)  :డీఎంకే మద్దతు ఉపసంహర ణతో మైనార్టీలో పడిన కేంద్ర ప్రభుత్వం కొత్త మిత్రులను వెదుక్కునే పనిలో బిజీగా ఉంది. ఏం చేసైనా సంకీర్ణ సర్కారును రక్షించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. డీఎంకేకు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేసిన తర్వాత యూపీఏ తన చర్యలను వేగవంతం  చేసింది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం మైనార్టీలో ఉందనే సంకేతాలు మంచివి కావని, ఆ లోటును పూడ్చుకోవాలని కాంగ్రెస్‌ అధినేత్రి ఇప్పటికే ముఖ్య నేతలను పురమాయించింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ థింక్‌ టాంకర్స్‌ ప్రత్యామ్నాయలను వెతుకుతున్నారు. ఏడాదికి ముందే ఎన్నికలకు వెళ్లేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేకోపోవడంతో కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక కానుంది. ములాయం, మాయావతిలలో ఏ ఒక్కరు దూరమైనా సర్కార్‌ మైనార్టీలో పడిపోతుంది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వంలో చేరేందుకు ములాయం కూడా సిద్ధంగా ఉన్నారు. కేసులు ఎదుర్కొంటున్న ములాయం కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ర్యాలీ చేపట్టడం ద్వారా యూపిఎకు స్నేహహస్తం సాచిన నితీష్‌ను దగ్గరకు తీసుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. బీహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తే యూపీఏతో దోస్తీకి సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచలు సాగిస్తోంది. అలాగే మమతా బెనర్జీని కూడా మరోమారు అక్కున చేర్చుకునే ప్రయత్నిస్తోంది. ఈ రకంగా డిఎంకె అధినేత కరుణానిధికి కాంగ్రెసు పార్టీ గట్టి షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. ఓ వైపు తమిళులపై ఊచకోతను నిరసిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటు, కరుణకు షాక్‌ ఇవ్వాలన్నది కాంగ్రెస్‌ యోచనగా ఉంది. ఒకవేళ కరుణను దూరం చేసుకుంటే తమిళనాడు నుంచి ఎఐడిఎంకె తనకున్న ఎంపీలతో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అధికారంలో ఉన్న జయలలితకు కేంద్రం నుంచి ఆపన్నహస్తం అవసరం. అందుకే ఇప్పుడు కరుణ వెళ్లిపోవడంతో పీడవిరగడయ్యిందన్న ఆనందంలో జయ ఉన్నట్లు సమాచారం. ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వానికి బయట నుంచి  మద్దతిస్తున్నాయి. అవి ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి ఇబ్బంది లేకున్నప్పటికీ తమను చిక్కుల్లో పడేసిన కరుణానిధికి ఝలక్‌ ఇచ్చేలా ఆయన మరో తనయుడు అళగిరికి అధికార పార్టీ గాలం వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా డిఎంకెను చీల్చే ప్రయత్నం కూడా చేయవచ్చని తెలుస్తోంది. కరుణ తర్వాత డిఎంకె అధ్యక్ష పీఠం విషయంలో అళగిరి, స్టాలిన్‌ల మధ్య విబేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అవి తారాస్థాయికి చేరాయి. కేంద్రమంత్రి పదవికి అళగిరి రాజీనామా చేయడానికి కొంత తటపటాయించారు.  అయితే ఒప్పించి రాజీనామా చేయించారు. ఈ దశలో ఆయన అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాల్లో అధికార పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అళగిరి ఇప్పటికే రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెసు మాత్రం ప్రయత్నాలు మానలేదట. అయితే, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, తమ పార్టీ అధిష్టానం మేరకే నడుచుకుంటామని అళగిరి చెబుతున్నారు. ఎన్డీయేలో ఉన్న జెడి(యు) పైనా కాంగ్రెసు పార్టీ కన్నేసింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ విబేధిస్తున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన ఎన్డీయేకు రాం రాం చెప్పనున్నారు. అంతేకాకుండా నితీశ్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పైన ఇటీవల ప్రశంసలు కురిపించారు. దీంతో జెడి(యు)ను తమ వైపుకు లాక్కునే ప్రయత్నాలు కాంగ్రెస్‌ చేస్తోంది. జెడి(యు)ను ప్రసన్నం చేసుకునేందుకు బీహార్‌ ప్రభుత్వం పలు డిమాండ్లను ఒప్పుకునేందుకు సిద్ధపడుతోందట. నితీశ్‌ డిమాండ్‌ ప్రకారం.. ఆయన పాలనలోని బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర ¬దా కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించాలని అధిష్టానం నిర్ణయించిందని సమాచారం. ఎన్డీయే మిత్ర పక్షాల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తు గురించి ఎవరికీ తెలియదన్నారు. మరోవైపు యూపిఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదని, మధ్యంతర ఎన్నికలకు అవకాశం లేదని జెడి(యు) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై బుధవారం నిప్పులు చెరిగారు. బెంగాలుకు రావాల్సిన నిధులను కేంద్రం సకాలంలో అందించడం లేదని, కేంద్రం బెంగాల్‌ ఆర్థిక పరిస్థితితో రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రజల విశ్వాసంతో తాము ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, మీలా రాజకీయాలు చేయడం తమకు తెలియదని కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. కేంద్రం ఓ వైపు సంక్షోభంలో కొట్టిమిట్టాడుతుంటే సందట్లో సడేమియాలాగా మమతా బెనర్జీ విరుచుకు పడటం గమనార్హం. ఈ దశలో యూపిఎ కొత్త మిత్రుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే నితీశ్‌, జయలలిత, మమతా బెనర్జీలు యూపిఎ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంతో ఉన్న అవసరాల దృష్ట్యా వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి.