కొత్త రైళ్ల ప్రతిపాదనే లేదు

C

చార్జీల పెంపులేదు

ఆధునీకరణ, డిజిటలైజేషన్‌ సౌకర్యాలు

స్వచ్చ భారత్‌కు పెద్దపీట

మహిళల భద్రతకు 182 టోల్‌ ఫ్రీ

వైఫై సీసీ కెమెరాలు, అప్పర్‌ బెర్తుకు నిచ్చెన

120 రోజుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌

కాజీపేట-విజయవాడ మధ్య మూడోలైన్‌ నిర్మాణం

2015-16 రైల్వే బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):  రైల్వే చార్జీలు పెంచకుండానే సౌకర్యాల కల్పన,భద్రతలకు పెద్దపీట వేస్తూ  కేంద్ర రెల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు తన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కొత్త రైళ్ల ప్రతిపాదన లేకుండా తొలిసారిగా కేంద్ర రైల్వే బడ్డెట్‌ ప్రవేశపెట్టారు. మేక్‌ ఇన్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ లక్ష్యంగా రైల్వేల ఆధునీకరణతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు  స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో కేంద్రమంత్రి సురేష్‌ప్రభు 2015-16 రైల్వే బడ్జెట్‌ను ప్రశేపెట్టారు. అంతేగాకుండా మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, టోల్‌ఫ్రీ నంబర్లను కూడా ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రైళ్లలో పరిశుభద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రైల్వే విలువైన జాతి సంపదని,  రైల్వే ద్వారా సామాన్యుడికి మెరుగైన సేవలు కొనసాగిస్తామన్నారు. 2015-16 రైల్వేబ్జడెట్‌ భవిష్యత్‌కు అద్దం వంటిదని కేంద్ర రైల్వేమంత్రి సురేశ్‌ ప్రభుప్రభు పేర్కొన్నారు. దేశ ఆర్థికవ్యవస్థతో రైల్వేలు మమేకమైవున్నాయని తెలిపారు. రానన్న ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. ఇందుకు  నాలుగు అంశాలను లక్ష్యాలుగా నిర్దేశించామన్నారు.  ప్రయాణికుల విశ్వాసాన్ని చూరగొనడం, సురక్షితమైన ప్రయాణం అందించడం, రైల్వేలను ఆధునీకరించడం, రైల్వేల ఆర్థికస్వావలంబన తమ ప్రధాన లక్ష్యమన్నారు. రైల్వే బ్జడెట్‌ ప్రసంగం ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా సాగింది. బ్జడెట్‌ ప్రసంగంలో కొత్త రైళ్లపై ఎలాంటి ప్రకటన చేయకుండానే రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ప్రసంగాన్ని ముగించారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్లపై ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రయాణఛార్జీలు పెంచకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.  స్వచ్ఛభారత్‌ మా ప్రధాన లక్ష్యాల్లో ఒకటన్నారు. రైల్వే  బడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి  సురేశ్‌ ప్రభు. మహిళల భద్రత కోసం టోల్‌ ఫ్రీ నెం. 182 ను ప్రకటించారు. మహిళా రక్షణ కోసం బోగీల్లో సీసీ కెమెరాలు  ఏర్పాటు.. మహిళా కోచ్‌ ల పెంపు.  వృద్ధులకు, వికలాంగులకు ఆధునిక  సౌకర్యాలు..ఆనలైన్‌ లో వీల్‌ ఛైర్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం. మహిళలకు, వృద్ధులకు  లోయర్‌ బెర్తులు  కేటాయించే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  మహిళా బోగీల్లో  సౌకర్యాల పెంపుకోసం నిర్భయ ఫండ్‌ కింద నిధులను కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు. 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. 17వేల టాయిలెట్లను ఆధునీకరిస్తామని ఆయన చెప్పారు. టెండర్లు ప్రకటించే అవకాశాన్ని జీఎంలకే ఇస్తున్నామన్న ఆయన మంత్రులకు భాగస్వామ్యం ఉండదని తెలిపారు. ప్రయాణికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని సురేష్‌ప్రభు పేర్కొన్నారు. రైల్వే ద్వారా దేశాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రైల్వేలో సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రైల్వే శాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఛార్జీల పెంపుపై ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకంటామని తెలిపారు. ఈ బ్జడెట్‌లో రైల్వే ఆధునీకరణ, విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. దేశానికి వెన్నెముక అయిన రైల్వేను మరింత బలోపేతం చేస్తామని అంటూనే,  రైలు రవాణాలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామన్నారు.  రైల్వేలపై ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయని,  రైల్వేలు దేశమంతటా విస్తరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రకటించారు. రైలు ప్రయాణ ఛార్జీల పెంపు లేదని ప్రకటించారు.  రైల్వే సమాచారం కోసం ఆలిండియా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 138 ను, భద్రత కోసం 182 నెంబరు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. బయో టాయిలెట్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని సురేశ్‌ ప్రభు అన్నారు.  గేజ్‌ మార్పిడి, విద్యుద్దీకరణలపై దృష్టి పెడతామన్నారు.  రైళ్లలో సమయపాలన పాటింపు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.  రైల్వేల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తూ,దేశంలో పేదరికం నిర్మూలనలో రైల్వేలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయన్నారు.  భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే బడ్జెట్‌ రూపకల్పన చేశామన్నారు.  కొన్ని దశాబ్ధాలుగా రైల్వేలు అభివృద్ధి చెందలేదు. రైల్వేలు అభివృద్ధి చెందడానికి భారీగా పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు లేక చాలాకాలంగా రైల్వేలు అభివృద్ధి చెందలేదు. రైల్వేలో భద్రత ఇప్పటికీ ఓ సవాలుగానే మిగిలింది. రైల్వేలో సౌకర్యాలు కావాలనుకునే వారు.. నిధులు లేవన్న సంగతి అర్ధం చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు అద్భుతాలేవిూ జరగవు, కొంత సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతమున్న కెపాసిటీని, నెట్‌వర్క్‌ను పెంచుకుంటామన్నారు.  ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకే ప్రాధాన్యతనిస్తామని అన్నారు. రైల్వేకు భూసేకరణ సమస్యలు లేవని, లైన్ల ఆధునీకరణ ద్వారా రైళ్ల వేగాన్ని పెంచుతామన్నారు. స్టేషన్ల ఆధనీకరణ, గూడ్స్‌ రంగాల్లో ప్రైవేటు సెక్టార్‌కు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు.  రానున్న ఐదేళ్లలో రూ. 8.50 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. . అదేవిధంగా రైల్వేల అభివృద్ధికి వివిధ మార్గాల ద్వారా నిధుల సేకరణ చేపడాతామని, . రైల్వే ప్రాజెక్టుల్లో రాష్టాల్రకూ భాగస్వామ్యం కల్పిస్తామని  అన్నారు.

120 రోజులకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పెంపు

భారతీయ రైల్వేల్లో రిజర్వేషన్‌ చేసుకునే సౌకర్యాన్ని 120 రోజులకు పెంచుతున్నట్టు కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు. ప్రస్తుతం ఈ విధానం 60 రోజుల వరకు వుంది. దీంతో నాలుగునెలల ముందే రిజర్వేషన్‌ చేసుకునే వీలు కలుగుతుంది. ప్రయాణికుల సౌకర్యాల కల్పన కోసం 67శాతం నిధులు ఖర్చు చేస్తామని అన్నారు.  ప్రయాణికుల సౌకర్యాల కోసం ఎంపీల్యాడ్స్‌ నుంచి కొంత నిధులు ఇవ్వాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.  రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఆర్థిక వనరుగా మార్చాల్సి ఉందన్నారు. నగరాల్లో రద్దీ రైల్వేస్టేషన్లకు అనుబంధంగా కొత్తరైల్వేస్టేషన్లు నిర్మాణం చేపడతామని అన్నారు.  నగరాల శివార్లలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్ల నిర్మాణం కూడా చేపడతామని అన్నారు. 400 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకుని రారున్నట్లు ప్రకటించారు.  స్వచ్ఛ రైలు, స్వచ్ఛభారత్‌ అమలు కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక రైళ్లలో తక్కువ ధరకు రక్షిత మంచినీరు సరఫరాచేస్తామని, ప్రధాన స్టేషన్లలో లిప్ట్‌లు, ఎస్కలేర్ల ఏర్పాటుకు రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. అప్పర్‌ బెర్త్‌ చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన ఏర్పాటు చేస్తామన్నారు.

కాజీపేట-విజయవాడ మధ్య మూడోలైన్‌ నిర్మాణం

కాజీపేట-విజయవాడ మధ్య మూడోలైన్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. ఈ రూట్లో రద్దీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఆర్ఫీఎఫ్‌ బలగాలకు యోగా శిక్షణ ఇవ్వడం, రైల్వే ప్రాంగణాల్లో జల సంరక్షణ చర్యలు చేపటట్డం.

రైల్వేల్లో విద్యుత్‌ ఆదాకు చర్యలు వంటివి ప్రకటించారు. రైళ్లలోని రిజర్వేషన్‌బోగీల్లో అప్పర్‌బెర్త్‌లను చేరుకునేందుకు ప్రత్యేకంగా నిచ్చెనలను రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. దీనిపై నేషనల్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సహకారం తీసుకుంటామన్నారు. జనరల్‌ బోగీల్లో మొబైల్‌ ఫోన్ల ఛార్జింగ్‌ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన రైల్వే బ్జడెట్‌ను ఆయన ప్రవశపెట్టారు.  విశ్రాంతి గదులను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే సౌలభ్యం, శతాబ్ది రైళ్లలో వినోద సౌకర్యం  భాగస్వామ్యాల ఏర్పాటుకు ప్రాధాన్యం. ఆపరేటింగ్‌ రేషియో 88.5శాతం  పరిశుభ్రమైన దిళ్లు, దుప్పట్లు సరఫరా కోసం ప్రయత్నం, వృద్ధులకు ఆన్‌లైన్‌ ద్వారా వీల్‌చైర్‌ బుకింగ్‌ సౌకర్యం, వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులకు లోయర్‌ బెర్త్‌లు కేటాయించేందుకు టీటీలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.

విజన్‌ 2030 డాక్యుమెంట్‌కు అనుగుణంగా కార్యాచరణ

భారత రైల్వేకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు. రైళ్ల రాకపోకలు, తదితర వివరాల గురించి సంక్షిప్త సందేశం అందేలా ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల కోసం టోల్‌ఫ్రీ నెంబరు 138ను రైల్వే మంత్రి ప్రవేశపెట్టారు. ఈ నెంబరు 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు. భద్రతకు సంబంధించిన అంశాల కోసం మరో టోల్‌ఫ్రీ నెంబరు 132ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాపలాలేని రైల్వే గేట్ల వద్ద హెచ్చరికలు

దేశంలో పలు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యలకు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు సంతాపం తెలిపారు. భద్రత అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికి కాపలాలేని రైల్వే గేట్ల వద్ద ఆడియో-విజువల్‌ హెచ్చరికలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైల్వేలో బ్యాంకులు, పింఛను నిధులను పెట్టుబడులుగా స్వీకరిస్తామని రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు వెల్లడించారు. లోక్‌సభలో రైల్వే బ్జడెట్‌ను ప్రవేశపెట్టి ఆయన ప్రసంగిస్తున్నారు.  అత్యున్నత ప్రమాణాలతో రైల్వేల నిర్వహణ, పారదర్శకత చూపుతామని అన్నారు.  మౌలిక సదుపాయాల ఆధునీకరణ ద్వారా ప్రయాణికుల సంఖ్య పెంపునకు కృషి చేస్తామన్నారు.