కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు
భద్రాద్రికొత్తగూడెం,డిసెంబర్6(జనంసాక్షి): జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న శిబిరాల్లో ఇప్పటి వరకు మొత్తం 78,702 కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ భావ్‌సింగ్ తెలిపారు. ఒక్కో వైద్య శిబిరంలో ఇద్దరు వైద్యులతో పాటు ముగ్గురు ఏఎన్‌ఎంలు, నలుగురు ఆశ వర్కర్లు విధులు నిర్వహించి రోగులకు సకాలంలో సేవలు అందిస్తున్నారు. శిబిరానికి వచ్చే వారు తప్పని సరిగా ఆధార్ కార్డు ఉండాలని అధికారులు సూచించడంతో ప్రజలు ఆధార్ కార్డులతో శిబిరాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,35,549 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 78,702 మందికి కళ్లద్దాలు ఇవ్వడం జరిగింది. అద్దాలు అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి అద్దాలు ఇస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు గత 69 రోజులుగా కొనసాగుతున్నాయి. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు శిబిరాలో పరీక్షలు చేసి ఆపరేషన్లు అవసరం అయిన వారికి ఎప్పటికప్పుడు ఆపరేషన్లను పూర్తి చేయిస్తున్నారు. దీంతో శిబిరాల్లో కంటి సమస్యలు ఉన్న రోగులు క్యూ కడుతున్నారు