కొరియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు

సియోల్‌, మార్చి 30 (జనంసాక్షి):
కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దక్షణ కొరియాతో యుద్ధం తప్పదన్న రీతిలో ఉత్తర కొరియా సన్నద్ధమవుతుంది. దక్షిణ కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అనుయుద్ధం తప్పదంటూ ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉభయ కొరియాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ సమయంలో అనుసరించాల్సి ప్రోటోకాల్‌ మేరకే సంబంధాలుంటాయని ఉత్తర కొరియా ఒక ప్రకటనలో పేర్కొంది. దక్షిణ కొరియా అమెరికా కలిసి అంతర్జాతీయంగా సంక్షోభానికి తెర లేపుతున్నాయని ఉత్తర కొరియా ఆరోపిస్తుంది. ఉభయ కొరియాల మధ్య ఎలాంటి శాంతి, సౌభ్రాతత్వాలు  కనబడడం లేదని కొరియన్‌ సెంట్రల్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఉభయ దేశాలు సాంకేతికంగా ఎప్పుడూ యుద్ధ వాతావరణంలోనే ఉంటున్నాయి. 1950-53 మధ్య కాలంలో జరిగిన కొరియన్‌ యుద్ధం శాంతి ఒప్పందంతో కాక సైనిక పద్దతిలో ముగియడంతో ఈ వైరం ఉభయ కొరియాల మధ్య కొనసాగుతూనే ఉంది. దక్షిణ కొరియా – అమెరికాల సంయుక్త సైనిక కసరత్తును నిరసిస్తూ సియోల్‌తో కుదుర్చుకున్న అన్ని ద్వైపాక్షిక శాంతి ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ఈ నెల మొదటి వారంలో ఉత్తర కొరియా ప్రకటించింది. అయితే ఇదేమీ కొత్త బెదిరింపు కాదని తమను రెచ్చగొట్టే చర్యలలో భాగంగానే ఈ హెచ్చరికలు చేస్తున్నదంటూ దక్షిణ కొరియా ఓ ప్రకటనలో కొట్టిపారేసింది.