కొలిక్కిరాని వివేకా హత్యకేసు


సిబిఐ దర్యాప్తులోనూ కానరాని ఆశ
హంతకుల నుంచి డాక్టర్‌ సునీతకు ప్రాణహాని ఉందా?
ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై సర్వత్రా అనుమానాలు
కడప,ఆగస్ట్‌17(జనంసాక్షి): రెండేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్‌ వివేకానంద రెడ్డి కేసు ఇంకా ఓ కొలిక్కి రావడంలేదు. సిబిఐ దర్యాప్తునకు దొరకనంతగా ఆయనను మర్డర్‌ చేశారని అర్థం అవుతోంది. ఇప్పటికీ సరైన ఆధారం సిబిఐ సేకరించలేదు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు పదేపదే విచారకు డిమాండ్‌ చేసి నిగ్గు తేల్చాలన్న వైసిపి ..ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఎటూ తేల్చలేదు. సొంత బాబాయ్‌ మర్డర్‌ కేసు విషయంలో జగన్‌ ఎందుకనో పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్పీకి అర్జీ పెట్టుకోవడం సంచలనమైంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారుల నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వరుసకు సోదరుడైన జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ డాక్టర్‌ సునీత ఆయనను ఆశ్రయించకుండా నేరుగా ఎస్పీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలని డాక్టర్‌ సునీత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. తన ఈ పోరాటంలో వైఎస్‌ కుటుంబీకులతో పాటు వైఎస్‌ షర్మిల కూడా తనకు అండగా ఉన్నారని ఆమె చెబుతున్నారు. భద్రత కోసం సిఎం జగన్‌ను అభ్యర్థించక పోవడం అనుమా నాలకు తావిస్తోంది. వివేకా హంతకులకు డాక్టర్‌ సునీత కూడా టార్గెట్‌గా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. డాక్టర్‌ సునీత తనను కలసి భద్రత కోరకపోయినప్పటికీ ఆమెకు రక్షణ కల్పించవలసిన బాధ్యత సిఎంగా జగన్‌ పైనే ఉంటుంది. ఆమెకు ఏమి జరిగినా ఆ పాపం జగన్‌ చేతులకు అంటుకుంటుంది. డాక్టర్‌ సునీత తాజా అర్జీ తర్వాత వివేకానంద రెడ్డి హంతకులకు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆశిస్సులు ఉన్నాయా అన్నచర్చ కూడా ప్రజల్లో రావడం గమనించాలి. అయితే సిఎం జగన్‌ కూడా ఈ కేసు త్వరగా తేల్చాలన్న భావనలోనే ఉంటారు. సొంత బాబాయ్‌ కనుక ఎక్కువగా శ్రద్ద పెడితే రాజకీయంగా అదీ చెడ్డపేరు వస్తుందన్న భావనలో ఉండివుంటారు. సొంత సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కూడా జగన్‌కు తలనొప్పిగా మారిందన్న భావన ఉంది. అలాగే సొంత బాబాయి కుమార్తె డాక్టర్‌ సునీత ఎస్పీకి ఫిర్యాదు చేయడం, గతంలో ఢల్లీిలో కూడా విూడిఆముందు ఆవేదన చెందడం కూడా సిఎం జగన్‌కు చీకాకు కల్పించే విషయాలే. సిబిఐ దర్యాప్తు త్వరగా ముగించి హంతకులను తేల్చితే తప్ప వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడదు.