కోడేరు తాహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.
అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా.
కోడేరు (జనం సాక్షి) జూలై 20 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అఖిలపక్షం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం కోడేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ధరణి వెబ్ సైట్ లో ఉన్నటువంటి కొన్ని లొసగులను ఆధారంగా చేసుకుని కొంత మందికి కోడేరు తాహసిల్దార్ మల్లికార్జున్ రావు భూ అక్రమ రిజిస్ట్రేషన్ మరియు అక్రమ బదలాయింపులకు పాల్పడుతున్నాడని అఖిలపక్షం నాయకులు తెలిపారు. వాటిలో ప్రధానంగా కోడేరు మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించిన భూమిని మధ్య దళారీ అయినటువంటి చల్లా నాగేశ్వర్ రెడ్డి మరి కొంతమంది తో కలిసి వెంకటేశ్వరరావుది సిమ్ కార్డును దొంగిలించి ఓటీపీ ద్వారా విస్తీర్ణం 11 ఎకరాల 17 గుంటల భూమి తన దాయాది అయిన పాండురంగారావుకు బదలాయింపునకు పాల్పడ్డారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి నర్సింహా మరియు అఖిలపక్ష నాయకులు తెలిపారు. తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వారితో కోడేరు తహసీల్దార్ మల్లికార్జున్ రావు కుమ్మక్కైనట్టు తెలుస్తుందని అఖిలపక్ష నాయకులు తెలిపారు. అక్రమంగా పట్టాదారుకు తెలియకుండా భూ అక్రమ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తావని అఖిలపక్ష నాయకులు తాహసిల్దార్ ని నిలదీశారు. తాహసిల్దార్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నంలో భాగంగా నాదేం తప్పులేదని కంప్యూటర్ ఆపరేటర్ దే తప్పని వివరణ ఇచ్చారు. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి కలెక్టర్ కు తాహసిల్దార్ చేసిన తప్పుడు భూ రిజిస్ట్రేషన్ ల పైన చర్యలు తీసుకొని విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయడం జరిగిందని అఖిలపక్ష నాయకులు తెలిపారు. మరుసటిరోజే తహసిల్దార్ మల్లికార్జున రావు భూ అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని నాయకులు తెలిపారు. వెంటనే భూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కోడేరు మండల తహసీల్దార్ బ్రమరౌతు మల్లికార్జున రావు ను సస్పెండ్ చేయాలని అఖిలపక్షాల ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.