కోదండ్ వైపు ఆమ్‌ఆద్మీ చూపు
తెలంగాణలో పాగా వేసేందుకు ఆప్ పక్కా ప్రణాళిక
భాజపా బలంగా లేని రాష్ట్రాల్లో పాతుకుపోవాలని వ్యూహం
తెలంగాణ పార్టీ పగ్గాలు కోదండరాంకు ఇచ్చే యోచనలో ఆప్
ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్
ప్రొఫెసర్ కోదండరామ్‌తో మంతనాలకు ఢిల్లీ నుండి బృందం
హైదరాబాద్, మార్చి1(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కోదండరాం పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటంలేదు. మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ తరపున పోటీచేయాలని సీపీఎం విజ్ఞప్తి చేసినా కోదండరాం పట్టించుకోలేదు. రాజకీయంగా ఇలా అవకాశాలు వస్తున్నా.. ఆయన మాత్రం తిరస్కరిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన పలు సందర్భాల్లో విమర్శలు మాత్రం సంధించారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు ప్రభుత్వం పనితీరును నిశితంగా గమనిస్తూ అవసరమైనప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే సచివాలయం తరలింపు నిర్ణయంపై కోదండరాం ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ప్రభుత్వాలు పనిచేయకూడదన్నారు. అలానే ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వటాన్ని వ్యతిరేకించారు. సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని కూడా వ్యరేకించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా జేఏసీ వాచ్ డాగ్‌లా వ్యవహరిస్తుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పనిచేస్తామని కోదండరాం మాట్టాడినప్పుడల్లా అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు ఇలా ఉన్నప్పటికీ ఇక ముందు కోదండరామ్ పంథా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
దిల్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆమ్‌ఆద్మీ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ఆప్ ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో భాగంగా ప్రధానంగా బీజేపీ ప్రాబల్యం లేని రాష్ట్రాల్లో పాగా వేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణపైన కూడా కన్నేసింది. తెలంగాణలో పార్టీ విస్తరించేందుకు మెండుగా అవకాశాలున్నాయని ఆప్ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రజల్లో చైతన్యం అధికంగా ఉందనేది వాస్తవం. ఇదే చైతన్యం ఆప్‌కు కావాలి. హస్తిన ప్రజలలో ఉన్న చైతన్యం వల్లనే కేవలం రెండేళ్లలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి అఖండ మెజారిటీ సాధ్యమైంది. అంతటి చైతన్యం ఉద్యమాల పురిటిగడ్డయిన తెలంగాణ ప్రజలకు ఉంధని ఆమ్ ఆద్మీ గుర్తించింది. ఈ కారణంగానే తెలంగాణలో బలమైన నాయకత్వాన్ని నియమించటం ద్వారా ఆప్‌కు సులువుగా ఆదరణ లభిస్తుందని పార్టీ నాయకత్యం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరామ్‌ను తెలంగాణ రాష్ట్ర పార్టీ సారథిగా నియమిస్తే జనాల్లోకి సులువుగా పార్టీని తీసుకెళ్లవచ్చని ఆప్ అధినాయకత్వం భావిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఏ పార్టీకి బలమైన నాయకత్వంలేదు. తెలంగాణ సాధనలో ఉద్యమసారధిగా నిలిచిన కేసీఆర్ అధికారపక్షంలో ఉన్నరు. కేసీఆర్‌కు బలమైన ప్రత్యర్థి ఏ పార్టీకి లేకపోవడం కొత్త పార్టీ అవకాశాలకు రన్‌వే పరుస్తోంది. సంప్రదాయ రాజకీయ పార్టీలన్నీ కార్పొరేట్‌లకు కొమ్ముకాస్తున్న నేపథ్యంలో దేశమంతా ఆప్ తరహా పార్టీ కోసం ఎదురు చూస్తున్నది. తెలంగాన ప్రజలు కూడా ఇందుకు మినహాయింపేమీకాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోవడం మళ్లీ మొదలైందని ఆప్ హస్తిన ఫలితాల్లో సాధించిన విజయం చేప్తోంది. స్వార్థ ప్రయోజనాలకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే తగిన బుద్ధి చెప్పటానికి నేటి తరం ఓటర్లు సిద్ధమయ్యారు. మాటలతో మభ్యపెట్టే ప్రభుత్వాలను కాకుండా చేతల ప్రభుత్వాలను అందలమెక్కించేందుకు నవతరం సిద్ధమైంది. అయితే తెలంగాణ విషయంలో ఓటరు మైండ్ సెట్ ఇంకా ప్రభుత్వ మార్పుపై ఆలోచనచేసే పరిస్థితి ఇంకా కనిపించటంలేదు. ఈ నేపధ్యంలో కోదండరామ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరితే ఫలితం ఎలా ఉంటుందోననే సందిగ్దంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేనందున తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి మరింత సమయం ఉన్నందున ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేయాలని ఆప్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నరు. ఇందుకోసం కోదండరామ్‌తో చర్చించేందుకు పార్టీ తరపున బృందం కూడా రానుందని సమాచారం. కోదండరామ్ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ పునర్నిర్మాణంలో మరింత కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. కానీ ప్రత్యక్ష రాజకీయాలపట్ల పెద్దగా ఆసక్తిలేని కోదండరామ్ ఆప్ ఆహ్వానంపట్ల ఎలా స్పందిస్తారన్నది చూడాలి. పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో అప్పజెప్పితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది సందేహం. ఎందుకంటే ఇప్పటికే పలు రాజకీయపార్టీలు ఇచ్చిన ఆఫర్లను తిరస్కరించిన కోదండరామ్ ఆమ్ ఆద్మీ ఆఫర్ పట్ల ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. కోదండరామ్ అంగీకరిస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశముంది.