కోహ్లి బీచ్‌లో వాలీబాల్‌ను కొడితే..!
వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సుదీర్ఘ విమాన ప్రయాణం అనంతరం కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు ప్రస్తుతం అక్కడ సేదతీరుతోంది. తొలి రోజు దీవుల్లోని ప్రకృతి అందాలను వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు.. రెండో రోజు బీచ్‌లో సరదాగా వాలీబాల్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి షర్ట్ విప్పేసి మరీ బీచ్‌లో బంతిని బలంగా కొడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు. సాధారణంగా మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో ఫుట్‌బాల్ ఆడటం కనిపిస్తుంటుంది. కానీ అక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తూనే టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం కొత్త ఆలోచనే.