క్రీడలకు రాజకీయాలకు సంబంధమేంటి?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. 1996 విల్స్ వరల్డ్ కప్ తర్వాత బీసీసీఐ ఆర్థిక స్వరూపం సమూలంగా మారిపోయింది. జగ్మోహన్ దాల్మియా నేతృత్వంలో వందల కోట్లకు పడగలెత్తింది. కొద్దిరోజుల్లోనే బోర్డు ఆర్థిక మూలలు విస్తరించి ఇప్పుడు అత్యంత ధనిక బోర్డు స్థాయికి చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న భారత దేశంలోని క్రికెట్ బోర్డు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని శాసించే స్థాయిలో ఉంది. బెల్లమున్న చోటే ఈగలు వాలినట్లు డబ్బులు సమకూరిన క్రికెట్ బోర్డుపై రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తుల కన్ను పడిరది. ఇప్పుడు, ఇంతక్రితం బీసీసీఐకి అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా ఆ రెండు వర్గాలకు చెందిన వారే. భారత జాతీయ క్రీడ హాకీ జవసత్వాలు కోల్పోయేలా చేసినవి కూడా ఈ రెండు వర్గాలేననే ఆరోపణలున్నాయి. ఒకప్పుడు క్లాస్ క్రీడగా పేరున్న క్రికెట్‌ను తదనంతరకాలంలో కార్పొరేట్ శక్తులు చేతుల్లోకి తీసుకొని పక్కా కమర్షియల్ గేమ్‌గా మార్చేశారు. ఐదు రోజుల టెస్ట్ ఫార్మట్ బోర్ కొట్టిస్తోందని ఒక్కరోజులోనే ముగిసే వన్డే క్రికెట్‌కు తెరతీశారు. మొదట్లో 60`60 ఓవర్ల మ్యాచ్‌గా ఉన్న వన్డే ఫార్మాట్‌ను 50`50 ఓవర్లకు కుదించారు. దానికి మరింత ప్రేక్షాధరణ కోసం 15 ఓవర్లలో ఫీల్డింగ్ లిమిట్స్, పవర్ ప్లేలు, ఫ్రీ హిట్‌లు ప్రవేశపెట్టారు. ఫలితంగా క్రికెట్ విపరీతంగా ప్రజాధరణ పెరిగింది. జనాభాలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న భారత్ తన జాతీయ క్రీడ హాకీని విస్మరించి క్రికెట్ వెంట పడిరది. క్రికెట్ ప్రపంచంలో తాను ఏది అంటే అది నడిపించుకుంటున్న బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరుతో పక్కా కమర్షియల్ గేమ్‌కు తెరతీసింది. ఐసీసీ వార్షిక ప్రణాళికలో ఐపీఎల్‌ను చేర్చి రెగ్యులర్ క్రికెట్ షెడ్యూల్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. క్రికెట్ ఆడే అన్ని దేశాల క్రీడాకారులను ఐపీఎల్ ఆకర్షించింది. వెస్టిండీస్, శ్రీలంఖ క్రికెట్‌లో పెను సంక్షోభాన్ని సృష్టించింది. అయినా ఐపీఎల్‌పై చర్యలకు ఐసీసీ సహసించలేదు. క్రికెట్‌లో 1990ల్లో వెలుగు చూసిన ఫిక్సింగ్ వ్యవహారం పక్కా కమర్షియల్ గేమ్‌లో ఐపీఎల్‌లో కొత్త పుంతలు తొక్కింది. గతంలో క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుతో పాటు బీసీసీఐ ఇచ్చే వేతనం, ఇతర ప్రోత్సాహకాలు మాత్రమే లభించేవి. క్రికెట్‌కు ప్రజాధరణ పెరిగిన తర్వాత క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో వచ్చిపడ్డాయి. వన్డే క్రికెట్ విస్తృతితో ఫోర్ కొడితే ఇంత, సిక్సర్ కొడితే ఇంత, వికెట్ తీస్తే ఇంత, కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ పడితే ఇంత అని ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రోత్సాహకాలిచ్చేవి. ఇప్పుడు అదికాస్త రివర్స్ అయింది. ఐపీఎల్‌లో ప్రతిభ క్రీడాకారులకు కాసుల పంట పండినా, అందరు ప్రతిభా వంతులు వెలుగులోకి రాలేదు. ఇంకా ఎందరో మట్టిలో మాణిక్యాలు అవకాశాలు రాక మరుగునే పడిఉన్నారు. బీసీసీఐలో కార్పొరేట్ శక్తులు, రాజకీయ నాయకుల ప్రవేశంతో సెలక్షన్ కమిటీ కూడా వారి గుత్తాధిపత్యంలోకి వెళ్లింది. ఫలితంగా వారికి సన్నిహితంగా ఉండే వారికే జాతీయ జట్టులో చోటు దక్కుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై పలు సందర్భాల్లో క్రీడా విశ్లేషకులు పలు ఉదాహరణలు మీడియా ముందుంచారు కూడా. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆదివారం వరకూ కొనసాగిన ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్‌కు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఉంది. ఆయన అల్లుడు సీఎస్‌కే సీఈవో గురునాథ్ మయ్యప్పన్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో అడ్డంగా బుక్కాయ్యాక శ్రీనివాసన్ అనివార్యంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. శ్రీనివాసన్ ఎప్పుడూ క్రికెట్ ఆడినట్టు ఎవరికీ తెలియదు. శ్రీనివాసనే కాదు బీసీసీఐతో పాటు ఐసీసీకి అధ్యక్షుడిగా పనిచేసిన శరద్‌పవార్, బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న లాలూప్రసాద్‌యాదవ్‌కు క్రికెట్ ఆడిన అనుభవమేమి లేదు. ఎప్పుడూ స్వదేశీ జపం చేసే అరుణ్‌జైట్లీ విదేశీ క్రీడను ప్రోత్సహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు కావాలని లాబీయింగ్ చేశాడు. అలాగే పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారెవరికీ క్రికెట్ మైదానంతో సంబంధం లేదు. కనీసం పిచ్ పొడవు, బౌండరీలైన్ పొడవు, ఫీల్డింగ్ పాయింట్స్ తెలిసే అవకాశాలు లేవు. అలాంటి వారి చేతుల్లో క్రికెట్ బోర్డు ఉంటే ప్రతిభావంతులైన పేద ఆటగాళ్లు ఎలా వెలుగులోకి వస్తారు. రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తులకు సన్నిహిత సంబంధాలున్న క్రికెటర్లు, వారికి రాజకీయంగా, వ్యాపార సంస్థల ఉత్పత్తుల ప్రచారానికి పనికి వస్తారనుకున్న వారికి రెడ్‌కార్పెట్ పరిచి జట్టులో చోటిస్తున్నారు. కొందరు క్రికెటర్లు టీమ్‌కు ఎంపికైనా చివరి 11 మంది జట్టులో చోటు దక్కదు. వారు పెవిలియన్‌కే పరిమితం. ఎవరైనా ఫీల్డింగ్‌లో గాయపడితే సబ్‌స్ట్యూట్‌గానో, బ్యాట్స్‌మన్లకు వాటర్ బాటిల్స్ చేరవేసే వారిగానో పరిమితమవుతున్నారు. క్రికెటర్లు కాని వారు బోర్డులో కీలక పదవుల్లో ఉండటమే క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. అలాంటి వ్యక్తుల పర్యవేక్షణలో సాగుతున్న టోర్నీల్లో కాసుల కోసం కక్కుర్తి పడొద్దంటే అది ఎంత వరకు సమంజసం. ఒకప్పుడు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నగదు ఇచ్చేవారు. ఇప్పుడు ఔటైతే ఇంత, తమకు తాముగా వికెట్ పారేసుకుంటే ఇంత, ఒక్క ఓవర్‌లో ఇన్ని పరుగులు ఇస్తే ఇంత అని డబ్బులు ముట్టజెప్పి మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్నారు. అండర్ వరల్డ్ కనుసన్నల్లో నడుస్తున్న బెట్టింగ్ భూతంలో బీసీసీఐ పెద్దలకూ ప్రమేయం ఉందనే ఆరోపణలను గురునాథ్ అరెస్ట్ నిజం చేసింది. అసలు క్రీడలకు రాజకీయాలకు సంబంధం ఏంటి? అంటూ ఇటీవల భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ సంధించిన ప్రశ్న ఇప్పుడు అందరినీ మనసులను తొలిచేస్తుంది. క్రికెట్‌ను క్రికెట్‌లా ఆస్వాదించాలంటే దానిపై కార్పొరేట్ శక్తులు, రాజకీయ నాయకుల ఆధిపత్యం పూర్తిగా తొలగాలి. ప్రతిభావంతులైన సీనియర్ క్రికెటర్ల చేతిలో బోర్డు పాలన పగ్గాలు పెడితే ఈ చీడ నుంచి కొంత వరకూ విముక్తి లభిస్తుంది. లేదంటే మైదానంలో జరుగుతున్న ప్రతి మ్యాచ్ అప్పటికే ఫిక్స్ అయి ఉంటుందనే భావన క్రీడాభిమానుల్లో కలుగుతుంది. అది క్రికెట్ భవిష్యత్‌నే ప్రశ్నార్థకం చేస్తుంది.