క్రీడా సంబరానికి సర్వం సిద్ధం

అలరించనున్న ఇళయరాజా, ఎఆర్‌ రహమాన్‌..
లండన్‌, జూలై 27: మరికొన్ని గంటల్లో క్రీడా సంబరం ఆరంభం కానున్నది. లండన్‌ ఒలింపిక్‌ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మెగా ఈవెంట్‌ను ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్‌, ప్రిన్స్‌ ఫిలిప్స్‌ ప్రారంభించనున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి క్రీడా సంబరం ప్రారంభం కానున్నది. క్రీడా సంబరం ప్రారంభం సందర్భంగా మూడు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. హాలీవుడ్‌ దర్శకులు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత డాని బోయెల్‌, స్టీఫెన్‌ డాల్డ్‌రీ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఎఆర్‌ రహమాన్‌, మరికొందరు ఈ సంబరాల్లో పాలుపంచుకోనున్నారు. ఆగస్టు 12తో క్రీడా సంబరం ముగియనున్నది. 13 క్రీడల్లో 81మంది భారతీయ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో 204 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రీడాకారులకు ఉద్యోగాలు : మాకెన్‌ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే భారత క్రీడాకారులకు భారత ప్రభుత్వం నజరానా ప్రకటించింది. పతకాలు సాధిస్తే అందరికి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ హామీ ఇచ్చారు.