క్రేజ్‌ తగ్గని కేజ్రీవాల్‌

cov20

సీఎంగా 54 శాతం ప్రజలు కేజ్రీవాల్‌ వైపే

49 రోజుల ఆమ్‌ఆద్మీ పాలన భేష్‌

6నెలల మోదీ పాలన హర 49 రోజుల కేజ్రీవాల్‌ పాలన

బేరీజు వేసుకుంటున్న హస్తిన వాసులు

2 నెలల్లో పుంజుకున్న ఆమ్‌ఆద్మీ

తప్పని హంగ్‌

అతిపెద్ద పార్టీగా భాజపా

ఆప్‌,కాంగ్రెస్‌ కలిపి సర్కారు ఏర్పాటు చేసే అవకాశం

దిల్లీ అసెంబ్లీ పోల్స్‌ పై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం…

దిల్లీ,జనవరి19,(జనంసాక్షి)… దిల్లీ పీఠంపై పాగా వేసి ఆమ్‌ ఆద్మీ 49 రోజులకే బాధ్యతల నుంచి పారిపోయిందన్న అపవాదు నుంచి ఆ పార్టీ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. అధికారం తీసుకోవాలా వద్దా అని ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయమడిగి గద్దెనెక్కి వదులుకునేటప్పుడు మాత్రం ప్రజల వద్దకు వెళ్లలేదు. కానీ 49 రోజుల్లో సామాన్యుని అధికారాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. మోదీ 6 నెల్ల పాలనకంటే ఆప్‌ 49 రోజుల పాలనే దిల్లీ జనం బాగుందంటున్నారు. అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించినా హంగ్‌ ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ జతకట్టి అదికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. నిరాడంబరుడుగా పేరున్న కేజ్రీవాల్‌ను మరోమారు హస్తినవాసులు సీఎంగా చూడాలనుకుంటున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన బీజేపీ ఫిబ్రవరి 7న జరగబోయే విధానసభ ఎన్నికల్లో అదే ఫలితాల్ని రిపీట్‌ చేసే పరిస్థితి కనిపించడంలేదు. బీజేపీ గద్దెనెక్కి ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో సగటు ఢిల్లీవాసి మోదీ పాలనను, కేజ్రీవాల్‌ 49 రోజుల పాలనను తూకం వేస్తున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి 46 శాతం, ఆమ్‌ ఆద్మీకి 31 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో లోక్‌సభ స్థానాలన్నీ బీజేపీయే కైవసం చేసుకుంది. గత లోక్‌ సభ ఎన్నికల సందర్భంలో మోదీ గాలికి ఆప్‌ చిత్తయిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మాత్రం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో ఆప్‌ అనూహ్యంగా పుంజుకుంది. నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన కేజ్రీవాల్‌ తన 49 రోజుల పాలనలో చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ఢిల్లీ జనాన్ని తనవైపుకి తిప్పుుకోవడంలో రోజురోజుకు మరింత ప్రగతి సాధిస్తున్నారు. వచ్చిన అధికారాన్ని ఎందుకు కాదనుకోవాల్సివచ్చిందో ప్రజలకు సవివరంగా వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని కేవలం 49 రోజులే నడిపినా ఆ కొద్దిపాటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను జనానికి గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దుచేసుకున్నందుకు జనాలకు క్షమాపణలు చెప్తున్న కేజ్రీవాల్‌ మాటలను జనం నమ్మేలా చేయటంలో కేజ్రీవాల్‌ సక్సెస్‌ అవుతున్నారు.

కేజ్రీవాల్‌ మాటలను జనం తొందరగా నమ్మటానికి కారణాలు లేకపోలేదు. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అయినా కూడా ఎన్నో సంచలనాలు సృష్టించారు. రాంలీలా మైదాన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి మెట్రో రైలులో వచ్చి అందర్నీ అబ్బురపరిచారు. తనకు భద్రత అవసరం లేదంటూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుని వార్తల్లోకెక్కారు. ముఖ్యమంత్రి హోదాలో భారీ కాన్వాయ్‌ను వాడుకునే అవకాశం ఉన్నా తన నీలి రంగు వాగన్‌ ఆర్‌ కార్లో సీఎం కార్యాలయానికి వచ్చి విధులకు హాజరయ్యేవారు. ముఖ్యమంత్రిగా ఉండగానే కేంద్రం ఆధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసు వ్యవస్థ పనితీరును ఎండగడుతూ ఎముకలు కొరికే చలిలో సైతం గొంగడి కప్పుకుని రాత్రి పగలు తేడా లేకుండా పార్లమెంట్‌ పరిసరాల్లో ఆందోళన నిర్వహించారు. ఒక ముఖ్యమంత్రే ఇలా రోడ్డెక్కడం చూసి యావత్‌ ప్రపంచం విస్తుపోయింది.

అంతే కాదు అధికారంలోకి రాగానే కొంత పరిమితి వరకు ఉచిత మంచినీటి సరఫరా అందించారు. పేద మధ్య తరగతి ప్రజలకు ఇది ఎంతగానో ఉపకరించింది. అప్పటిదాకా వందలకొద్దీ నీటిపన్ను చెల్లించిన ఎంతోమందికి దీనిద్వారా ఊరట లభించింది. ఇక కరెంటు చార్జీలు 50 శాతం వరకు తగ్గించటం కూడా కేజ్రీవాల్‌కు కలిసొచ్చే అంశం. ఇలా తాను అధికారంలో ఉన్న 49 రోజుల్లో రోజుకో సంచలనాత్మక నిర్ణయంతో కేజ్రీవాల్‌ ప్రజల హృదయాల్ని దోచుకున్నారు. ఇలా తాను సంపాదించుకున్న ప్రజాదరణ ఒకెత్తయితే ఆమ్‌ ఆద్మీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా మరో ఎత్తు. ఢిల్లీ ఓటర్లలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉండటానికి ఇవే ప్రధాన కారణం. ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించిన కేజ్రీవాల్‌ అధికారంలో ఉన్న 49 రోజుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుని జనం గుండెల్లో నిలిచిపోయారు.

ఇక మరోవైపు ఆమ్‌ఆద్మీకి ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ కేజ్రీవాల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ఐపీఎస్‌ కిరణ్‌బేడీని రంగంలోకి దించింది. అన్నాహజారేతో కలిసి జనలోక్‌పాల్‌ ఆందోళనలో సమిష్టిగా పాల్గొన్న వీరిరువురూ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా మారిపోయారు. రాజకీయాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించొచ్చన్న కేజ్రీవాల్‌ విధానాలను గతంలో వ్యతిరేకించిన కిరణ్‌బేడీ ఇప్పుడు బీజేపీ తరపున బరిలోకి దిగడం దిల్లీ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారన్నది చూడాలి. ఏదేమైనా మోదీ 6 నెలల పాలనకంటే కేజ్రీవాల్‌ 49 రోజుల పాలనే భేష్‌ అన్న అభిప్రాయం దిల్లీ వాసుల్లో వ్యక్తమవుతోంది. ఏదేమైనా ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్‌ క్రేజ్‌ మాత్రం స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. ఢిల్లీ పీఠం కేజ్రీవాల్‌ను వరిస్తుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాలతోనే తేలుతుంది.