క్లియస్టర్స్‌కు షాక్ – మూడో రౌండ్‌లో షరపోవా , క్విటోవా
పురుషుల సింగిల్స్‌లో ఫెర్రర్ , డెల్‌పొట్రో , హెవిట్ జోరు
న్యూయార్క్,ఆగష్ట్ 30 :యుఎస్ ఓపెన్‌లో మూడో రోజు కూడా సంచలన ఫలితం నమోదైంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బెల్జియం భామ కిమ్ క్లియస్టర్స్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బ్రిటన్‌కు చెందిన రాబ్సన్ 7-6 , 7-6 తేడాతో క్లియస్టర్స్‌పై గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలో మాత్రం సీడెడ్ క్రీడాకారిణులే ముందంజ వేశారు. రష్యన్ బ్యూటీ మరియా షరపోవా మూడో రౌండ్‌లోకి దూసుకెళ్ళింది. షరపోవా రెండో రౌండ్‌లో 6-0 , 6-1 తేడాతో స్పెయిన్‌కు చెందిన లినోపై విజయం సాధించింది. అలాగే ఐదో సీడ్ చెక్ రిపబ్లిక్ ప్లేయర్ పెట్రా క్విటోవా 6-4 , 6-3 స్కోర్‌తో ఫ్రాన్స్‌కు చెందిన కార్నెట్‌పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఆస్టేల్రియన్ ఓపెన్ ఛాంపియన్ సమంత స్టోసర్ 6-3 , 6-0 తేడాతో రొమేనియా క్రీడాకారిణి గాల్లోవిట్స్‌పై గెలిచి మూడో రౌండ్ చేరుకుంది. ఇక తొమ్మిదో సీడ్ చైనా క్రీడాకారిణి లినా 6-4 , 6-4 తేడాతో ఆస్టేల్రియాకు చెందిన డెల్లెకాపై గెలుపొందింది. వీరితో పాటు నదియా పెట్రోవా , మరియన్ బర్తోలీ అజరెంకా కూడా మూడో రౌండ్‌కు దూసుకెళ్ళారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సీడెడ్ ఆటగాళ్ళ జోరు కొనసాగుతోంది. మారథాన్ మ్యాచ్ స్పెషలిస్ట్ జాన్ ఇస్నర్ రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో ఇస్నర్ 6-3 , 7-6 , 5-7 , 7-6 స్కోర్‌తో బెల్జియం ఆటగాడు మెలెస్సీపై పోరాడి విజయం సాధించాడు. అలాగే బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో ముర్రే 6-2 , 6-1 , 6-3 తేడాతో క్రొయేషియాకు చెందిన డొడిక్‌పై గెలిచాడు. అటు స్పెయిన్ ఆటగాడు డేవిడ్ ఫెర్రర్ , అర్జెంటీనా ప్లేయర్ డెల్‌పొట్రో , టిప్సారెవిచ్ ముందంజ వేశారు.