క్లీన్‌స్వీపే టీమిండియా టార్గెట్
రేపటి నుండి కివీస్‌తో రెండో టెస్ట్
బెంగళూర్ ,ఆగష్ట్ 30 :న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా భారత జట్టు రెండో టెస్టుకు సిధ్దమైంది. రేపటి నుండి బెంగళూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లోనూ కివీస్‌ను చిత్తుగా ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్ , బౌలింగ్‌లలో ప్రత్యర్థి కంటే మంచి ఫామ్‌లో ఉండడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. హైదరాబాద్‌లో ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను స్పిన్ మంత్రంతో కట్టడి చేయడంలో కెప్టెన్ ధోనీ సూపర్‌గా సక్సెసయ్యాడు. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లు పడగొట్టగా… మరో స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా చక్కని సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరి జోరుతో కివీస్ ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే రెండో టెస్ట్ జరిగే చిన్నస్వామి స్టేడియం సీమర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుందా… లేక ఒక్క స్పిన్నర్‌కే పరిమితమవుతుందా అనేది వేచి చూడాలి. బ్యాటింగ్‌లో మాత్రం సెహ్వాగ్‌తో పాటు చటేశ్వర పుజారా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చాలా కాలంగా జాతీయ జట్టులో ప్లేస్ కోసం ఎదురుచూసిన పుజారా ద్రావిడ్ రిటైర్మెంట్‌తో ఆ స్థానం దక్కించుకున్నాడు. అంచనాలకు తగ్గట్టే తొలి టెస్టులో 159 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అతనిపై మరోసారి అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఎంపీ ¬దాలో ఆడుతోన్న సచిన్ సెంచరీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్పిన్నర్ల జోరుతో తొలి మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరమే రాని మన క్రికెటర్లు బెంగళూర్‌లో ఏ విధంగా రాణిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే భారత్‌తో టెస్ట్ సిరీస్‌ను సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. స్పిన్ బౌలింగ్‌ను ఏ మాత్రం ఎదుర్కోలేక చేతులెత్తేసిన కివీస్ ఆటగాళ్ళు ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టారు. మ్యాచ్ నాలుగోరోజే ముగిసినప్పటి నుండీ ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడిపారు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోనేందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. అయితే బెంగళూర్ పిచ్ సీమర్లకు అనుకూలంచే అవకాశాలున్నాయని క్యూరేటర్ చెప్పడంతో వారికి కాస్త ఉపశమనం లభించింది. కివీస్ ఫాస్ట్ బౌలర్లు ఫామ్‌లో ఉండడమే దీనికి కారణం. రెండో టెస్టులో మెరుగ్గా రాణించి సిరీస్‌ను సమం చేస్తామని కివీస్ సారథి రాస్ టేలర్ ధీమా వ్యక్తం చేశాడు. రెండు జట్ల కెప్టెన్లు తమ తుది జాబితాపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. రేపు మ్యాచ్‌కు ముందు తుది జట్టును ఖరారు చేసే అవకాశాలున్నాయి.
భారత తుది జట్టు ( అంచనా ) ః
సెహ్వాగ్ , గంభీర్ , కోహ్లీ , పుజారా , సచిన్ , ధోనీ , రైనా లేక బద్రీనాథ్ , జహీర్‌ఖాన్ , ఇశాంత్ శర్మ లేక ఓజా , అశ్విన్ , ఉమేశ్ యాదవ్
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా )ః
మెక్‌కల్లన్ , గుప్తిల్ , విలియమ్సన్ , టేలర్ , ఫ్లిన్ , ఫ్రాంక్లిన్ , వాన్‌విక్ , బ్రేస్‌వెల్ , పటేల్ , బౌల్ట్ , క్రిస్ మార్టిన్