క్వాలిటీ బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి చూపు

గుండాల గని కోసం కసరత్తు
ఖమ్మం,మే29(జ‌నం సాక్షి): సింగరేణి సంస్థ లాభాల కోసం క్వాలిటీ బొగ్గువైపు మొగ్గు చూపుతోంది. ఉత్పత్తి, కార్మికుల సంఖ్య దృష్టిలో పెట్టుకొని నష్టాలు వాటిల్లుతాయనే నెపంతో భూగర్భ మైన్లను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఓసీలకే ప్రాధాన్యతనిస్తూ సంస్ధ ముందడుగు వేసుకొచ్చింది. గుండాలలో భూగర్భ గనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  గుండాలలో లభించేది జీ 13 గ్రేడ్‌ బొగ్గుగా సర్వేలో తేలింది. బహుశా సింగరేణిలో జీ 13 గ్రేడ్‌ బొగ్గు కొన్ని చోట్లే లభిస్తోంది. ఇటీవల సింగరేణి డైరెక్టర్ల బోర్డు కమిటీ గుండాలలో అండర్‌ గ్రౌండ్‌లు మైన్లు ప్రారంభించి జీ 13 గ్రేడు బొగ్గును ఉత్పత్తి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిసింది. వెంటనే ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీంతో సింగరేణి యాజమాన్యం గుండాలలో మైన్స్‌ ప్రారంభానికి కసరత్తు చేపట్టింది. 2019-20 ప్రారంభ సంవత్సరంలో గుండాలలో భూగర్బ మైన్స్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సింగరేణి యాజమాన్యం అనుకున్నట్లే రెండు నూతన బావులను ప్రారంభిస్తే వాటి జీవిత కాలం 40 సంవత్సరాల వరకూ ఉంటుంది. ఇదే క్రమంలో బొగ్గు నిక్షేపాల కోసం నిరంతర సర్వే చేపడితే అదనంగా మరో మూడు బావులు ప్రారంభించవచ్చు. పినపాక మండలంలో మరికొన్ని నూతన బావులు వెలిసే అవకాశం లేకపోలేదు. వాటిని దృష్టిలో పెట్టుకుంటే వంద సంవత్సరాల వరకు బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. బొగ్గును తరలించేందుకు రైల్వే శాఖను లైన్‌ వేయడం లేదా సవిూపంలో ఉన్న మార్గాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో  బేతంపూడి స్టేషన్‌కు జంక్షన్‌ ఏర్పాటు చేయవచ్చు. బేతంపూడి నుంచి కోయగూడెం ఓసీకి, అక్కడి నుంచి గుండాలకు రైల్వే మార్గం వేసే అవకాశం ఉండొచ్చు. యాజమాన్యం వీటన్నీంటినీ దృష్టిలో పెట్టుకొని రైల్వే లైన్‌ గుండాలకు వేయాల్సి ఉంటుంది. లేదా మణుగూరు నుంచైనా బొగ్గు రవాణా కోసం రైల్వే లైన్‌ వేయాల్సి రావొచ్చు. గుండాలలో నూతన బావులు ప్రారంభమైతే ఇల్లెందు ఏరియాకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. ఆ రెండు బావులు ప్రారంభమైతే సుమారు 3 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు మైన్స్‌ సంఖ్య కూడా పెరుగుతోంది. గుండాలలో మైన్స్‌ ప్రారంభమైతే కార్మికుల కోసం ప్రత్యేక కాలనీలు, అత్యాధునిక వసతులు, విద్యుత్‌ ఎ/-లాంట్‌, ఏరియా ఆసుపత్రి, తదితర డిపార్ట్‌మెంట్లన్ని రూపుదిద్దుకుంటాయి. దీంతో రానున్న కాలంలో గుండాలకు మహర్దశ పట్టనుంది. గుండాల మండలంలో బొగ్గు నిక్షేపాల కోసం 1998 నుంచే సర్వే ప్రారంభమైంది. మొదట ఎంవీసీఎల్‌ అనే ప్రైవేట్‌ కంపెనీ సర్వే చేపట్టింది. మండలంతోపాటు ఇప్పుడున్న ఆళ్ళపల్లి మండలం కాచనపల్లి, ముత్తారం, శెట్టుపల్లి తదతర గ్రామాల్లో సర్వేను వేగవంతం చేశారు. కొన్నాళ్ల తరువాత సింగరేణి యాజమాన్యమే స్వయంగా సర్వేను చేపట్టింది. మూడేళ్ళ క్రితం వరకు సర్వే నిరంతరాయంగా కొనసాగింది. సింగరేణి సంస్థ మొదట మూడు ఓసీలను ప్రారంభించాలని నిర్ణయించింది. కాచనపల్లి, గుండాల, శెట్టుపల్లిలో ఉపరితల గనులను ప్రారంభించాలని అనుకుంది. స్థానికుల నుంచి వ్యతిరేకత వెలువడడంతో వెనుకడుగేసింది. కాగా పర్యావరణానికి ఓసీలు పెనుముప్పుగా మారతాయని, ఓసీల నిర్ణయాన్ని విరమించుకోవాలని స్ధానికులు ఆందోళన చేపట్టారు. వీటికి తోడు పర్యావరణ, ఫారెస్టు శాఖల నుంచి అనుమతి లభించకపోవడం, వాటర్‌ రీసోర్స్‌మెంట్‌, జీవసంరక్షణ శాఖలు వ్యతిరేకించడం, పలు శాఖలు ప్రతిపాదనను తిరస్కరించడంతో సంస్థ ఆలోచనలో పడింది. చివరకు ఇక్కడ నిక్షేపాలు ఉండడంతో మార్గం సుగమం అయ్యింది.