క్షిపణి నియంత్రణ మండలిలో భారత్‌కు చోటు

2

న్యూఢిల్లీ,జూన్‌ 27(జనంసాక్షి): ప్రతిష్టాత్మక మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజిమే (క్షిపణి సాంకేతిక నియంత్రణ మండలి- ఎంటీసీఆర్‌)లో భారత్‌ సభ్యురాలైంది. విధ్వంసక క్షిపణులు, వాయిమార్గంలో ప్రయాణించే ఇతర వాహనాల విచ్చలవిడి వ్యాప్తిని నిరోధించేందుకు ఏర్పాటయిన ఎంటీసీఆర్‌ లో సభ్యత్వం ద్వారా భారత్‌.. అత్యాధునిక క్షిపణి పరిజ్ఞానంతోపాటు నిఘా డ్రోన్లను కొనుగోలుచేసుకునే వీలుంటుంది. అంతేకాదు అణు సరఫరా దేశాల కూటమి(ఎన్‌ఎస్‌ జీ)లో భారత సభ్యత్వానికి మోకాలొడ్డిన చైనాను సవిూప భవిష్యత్‌ లోనే దారికి తెచ్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఢిల్లీలోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌. జైశంకర్‌ ఎంటీసీఆర్‌ సభ్యత్వానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. 38 దేశాల ఎంటీసీఆర్‌ లో కీలకపాత్ర పోషిస్తోన్న ఫ్రాన్స్‌, నెదర్లాండ్‌, లక్సెంబర్గ్‌ రాయబారుల సమక్షంలో భారత్‌ చేరిక విజయవంతమైందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌ తో అణు ఒప్పందంలో భాగంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సంబంధించిన అన్ని కూటములలో సభ్యత్వాన్ని సమర్థిస్తానని అమెరికా గతంలో చేసిన వాగ్ధానానికి కార్యరూపమే ఎంటీసీఆర్‌ లో చేరికని అంటున్నారు.  ప్రస్తుతం ఎంటీసీఆర్‌ లో భారత్‌ తో కలిపి 38 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాలన్నీ 500 కేజీల బరువు, లక్ష్యం పరిధి 300 కిలోవిూటర్లకు పైబడిన బాలిస్టిక్‌ క్షిపణులు తయారుచేయబోవు. ఒకవేళ ఇంతకు ఉంటేగనుక వాటిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. తద్వారా సభ్యదేశాల నుంచి అత్యాధునిక క్షపణి పరిజ్ఞానాన్ని, డ్రోన్లు, ఇతర వాహక నౌకలను దిగుమతి చేసుకోవచ్చు. మున్ముందు భారత్‌ సొంతగా రూపొందించబోయే టెక్నాలజీని కూడా అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. ఎంటీసీఆర్‌ లో సభ్యత్వం లేకపోవడం వల్లే ఇజ్రాయెల్‌ తాను రూపొందించిన అత్యాధునిక అంతరీక్ష నౌక(షావిత్‌)లను అమ్ముకోలేక పోవడం గమనార్హం.

చైనాకు చెక్‌ పెట్టొచ్చు!

ఎంటీసీఆర్‌ లో సభ్యత్వం ద్వారా భారత్‌ చైనాకు చెక్‌ పెట్టే అవకాశాలున్నాయి. 2004 నుంచి ఎంటీసీఆర్‌ లో చైనా సభ్యత్వం పరిశీలనలో ఉంది. వరుస క్షిపణి ప్రయోగడాలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఉత్తర కొరియాకు చైనా వెన్నుదన్నుగా నిలుస్తున్నదని ఎంటీసీఆర్‌ లోని మిగతా దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా మాత్రం పైకి తాను బాలిస్టిక్‌ క్షిపణుల తయారీని నిలిపేశానని చెప్పుకుంటోంది. లోలోన మాత్రం విధ్వంసక ఆయుధాల విక్రయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్‌ తో చైనా చేసుకున్న ఆయుధ సరఫరా ఒప్పందం కూడా అలాంటిదే. ప్రయత్నాలు ప్రారంభించిన ఏడాదో లోపే భారత్‌ కు ఎంటీసీఆర్‌ సభ్యత్వం దక్కడం గమనార్హం. తద్వారా భారత్‌ మున్ముందు చైనాపై ఒత్తిడి తీసుకువచ్చే లేదా ఆ దేశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎలాగైతే భారత్‌ కు ఎన్‌ఎస్‌ జీ సభ్యత్వం దక్కకుండా చైనా మోకాలడ్డిందో, భవిష్యత్‌ లో భారత్‌ కూడా చైనా ఎంటీసీఆర్‌ సభ్యత్వానికి అడ్డుపడొచ్చు. ఆ సందర్భమే తలెత్తితే.. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఎన్‌ఎస్‌ జీ సభ్యత్వానికి మార్గాలు సుగమం చేసుకోవచ్చు.