ఖబ్జాఖోర్‌ ఖబ్రస్థాన్‌ ఛోడ్‌

శవాలపై పేలాలు ఏరుకుంటావా ?
నువ్వు ప్రజాప్రతినిధివా ?
సమాధులపై నివాసముంటున్న దయ్యానివి
మృత్యుంజయాన్ని కాంగ్రెస్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలి
ఆయన తహసిల్దార్‌తో తప్పుడు నివేదికలు ఇప్పించాడు..
ముస్లింలు కావాలో.. మృత్యుంజయం కావాలో కాంగ్రెస్‌ తేల్చుకోవాలి..
‘కటకం’పై గర్జించిన గంభీరావుపేట ముస్లింలు
గంభీరావుపేట, జూలై 10 (జనంసాక్షి) : ”ఖబ్జాఖోర్‌ హమారా ఖబ్రస్థాన్‌ ఛోడ్‌.. అభీతో ఖాళీ కర్‌..” అంటూ గంభీరావుపేట ముస్లింలు జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృత్యుంజయం, ఆయన కొడుకులు ముస్లింల శ్మశాన వాటికకు చెందిన మూడెకరాల మూడు గుంటల స్థలంలో మూడెకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మృత్యుంజయం వెంటనే బహిష్కరించాలని, లేకుంటే ముస్లిం వర్గాలు కాంగ్రెకు దూరమవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ముస్లింలు కావాలో, మృత్యుంజయం కావాలో తేల్చుకోవాలన్నారు. గంభీరావుపేట తహశీల్దార్‌ కూడా మృత్యుంజయంతో చేతులు కలిపి, కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు పంపించాడని ఆరోపించారు. కలెక్టర్‌ ప్రజావేదిక నిర్వహిస్తే తాము తమ అభిప్రాయాలు తెలుపుతామన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలం కిందట కటకం మృత్యుంజయం గంభీరావుపేటలోని ముస్లింల శ్మశాన వాటిన స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
అప్పట్లో ఈ విషయాన్ని ఆయన ఖండించారు. సదరు శ్మశాన వాటికను సందర్శించిన ముస్లిం నాయకులు, జిల్లా ఈద్గా మజీద్‌ కమిటీ మృత్యుంజయం తనదిగా చెప్పుకుంటున్న స్థలం ముమ్మాటికీ ముస్లిం శ్మశాన వాటికేనని, దీనికి సాక్ష్యంగా ఆ స్థలంలో నిజాం కాలం నాటి ముస్లింలకు చెందిన సమాధులున్నాయని ఫొటోలు, సాక్ష్యాలతో సహా మీడియాకు వివరాలు అందించింది. కానీ, ఈ వ్యవహారన్నంతా మృత్యుంజయం కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా మస్జిద్‌, ఈద్గా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గంభీరావుపేట ముస్లింలు మృత్యుంజయం ముమ్మాటికీ శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించిన కబ్జాదారేనని విమర్శిస్తూ మంగళవారం సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆ స్థలాన్ని మృత్యుంజయం నుంచి వక్ఫ్‌ బోర్డుకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.
శవాలపై పేలాలు ఏరుకునే వాడిలా వ్యవహరిస్తున్న మృత్యుంజయం ప్రజాప్రతినిధిగా ఉండడానికి తగడన్నారు. ముస్లింల సమాధులను ఆక్రమించిన మృత్యుంజయం దయ్యాలకే దయ్యమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజాం కాలం నుండి ఉన్న అక్కడి సమాధుల్లో కొన్నింటిని కటకం, అతని కొడుకులు కూలగొట్టారని ఆరోపించారు. మృత్యుంజయం అతని కొడుకులకు తమ తహసిల్దార్‌ సహకరించి తప్పుడు నివేదికలు పంపించాడన్నారు. కలెక్టర్‌ ఈ విషయంలో ప్రజావేదిక ఏర్పాటు చేస్తే బహిరంగంగా ఈ విషయాన్ని తాము కలెక్టర్‌కు నివేదిస్తామని వివరించారు. ఆర్డీఓ వెంటనే స్పందించి సదరు భూమిపై సర్వే చేయించి, ఆక్రమణకు గురైన స్థలాన్ని వెంటనే వక్ఫ్‌ బోర్డుకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ముస్లింలు ఆ స్థలం కోసం ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వెంటనే తమ డిమాండ్‌ను తీర్చకుంటే ఆర్డీఓ కార్యాలయం ఎదుటే రిలే దీక్షలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ సునందను కలిసి వినతిపత్రం అందించారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇబాదుల్లా ఖాన్‌, సయ్యద్‌ జంషీద్‌ అలీ, మహ్మద్‌ అహ్మద్‌, సయ్యద్‌ జుబేర్‌, అబ్దుల్‌ రహీం, ఎం.ఎ.వహీద్‌, సాదిఖ్‌, యాసీన్‌, విలాయత్‌, సయ్యద్‌ ఖుతూబ్‌, ఖుతూబ్‌ తదితరులతోపాటు నలభై మంది పాల్గొన్నారు.